Mohammed Yunus: హిందువులపై దాడులు మతపరమైనవి కాదు
ABN , Publish Date - Sep 06 , 2024 | 06:00 AM
ఆందోళనల సందర్భంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులు మతపరమైనవి కాదని.. ఈ అంశంలో భారత్ ప్రచారం చేసిన తీరు సరికాదని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు.
రాజకీయాలతో పెద్దగా చూపారని మోదీకి చెప్పా
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్
ఢాకా, సెప్టెంబరు5: ఆందోళనల సందర్భంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులు మతపరమైనవి కాదని.. ఈ అంశంలో భారత్ ప్రచారం చేసిన తీరు సరికాదని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌కు మద్దతుదారులుగా ఉన్న హిందువులపైనే దాడులు చోటుచేసుకున్నాయని, రాజకీయ కారణాలతో వాటిని పెద్దగా చూపారని పేర్కొన్నారు. ఇందులో అనేక కోణాలున్నాయని, ఇదే విషయాన్ని భారత ప్రధాని మోదీకి కూడా చెప్పానన్నారు.
మైనారిటీల భద్రత తమ ప్రాధాన్యం అంశమని, పొరుగు దేశంతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామన్నారు. యూనస్ ఢాకాలో మీడియాతో మాట్లాడుతూ హసీనా భారత్‌లో ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. అప్పగించాలని కోరే దాకా మౌనంగా ఉంటే అది ఆమెకు రక్ష అని అన్నారు. లేదంటే ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. హసీనా దురాగతాల గురించి విచారణ తప్పదన్నారు.
అల్లర్ల బాధితులకు న్యాయం జరగాలంటే మాజీ ప్రధానిని స్వదేశానికి తీసుకురావడం తప్పనిసరి అని.. లేదంటే ప్రజలు క్షమించరన్నారు. కాగా, వివరాలన్నీ పరిశీలించాక అదానీతో కుదుర్చుకున్న విద్యుత్తు ఒప్పందంపై అవసరమైతే సమీక్ష చేస్తామని యూనస్ చెప్పారు. కాగా బంగ్లాదేశ్‌లో ఆందోళనలకు పాల్పడిన వారిని శిక్షించాలంటూ ఆగస్టు 13న హసీనా కోరారు. అమెరికాలో ఉంటున్న ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ ట్విటర్ ఖాతా నుంచి ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.