Fire Accident: అడవిలో చెలరేగిన మంటలు.. 46 మంది మృతి
ABN , Publish Date - Feb 04 , 2024 | 09:14 AM
చిలీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా అడవిలో ఆకస్మాత్తుగా ఏర్పడిన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో దాదాపు 46 మంది మృత్యువాత చెందారు.
చిలీ(chile)లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా అడవిలో ఆకస్మాత్తుగా ఏర్పడిన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో దాదాపు 46 మంది మృత్యువాత చెందారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా తెలిపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసుకొస్తున్నారు. మరికొంత మందిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు 19 హెలికాప్టర్లు, 450కి పైగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ ప్రమాదం కారణంగా సుమారు 1,100 గృహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై దేశాధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ స్పందించారు. మంటలు శరవేగంగా వ్యాపించాయని వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు చేయడం కష్టంగా మారిందన్నారు. గాలి బలంగా వీస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశంలోని మధ్య, దక్షిణాన ఉన్న 92 అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. వల్పరైసో ప్రాంతంలో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో వల్పరైసో ప్రాంతంలో మూడు షెల్టర్ క్యాంపులను ఏర్పాటు చేశారు.