International : బంగ్లాదేశ్‌లో జైలుకు నిప్పు.. ఖైదీల పరారీ
ABN , Publish Date - Jul 20 , 2024 | 03:47 AM
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. శుక్రవారం కొందరు ఆందోళనకారులు..
శుక్రవారం 19 మంది మృతి.. 105కు పెరిగిన మృతులు
మూడు వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి
ఢాకా, జూలై 19: బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. శుక్రవారం కొందరు ఆందోళనకారులు.. ఢాకాకు 40 కి.మీల దూరంలో గల నర్సింగ్డిలోని ఓ జైలును ముట్టడించారు. అందులోని వందల మంది ఖైదీలను విడిపించారు.
అనంతరం జైలుకు నిప్పుపెట్టారని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఘర్షణల్లో 19 మంది పౌరులు మరణించగా... పోలీసులతో పాటు వందల మంది గాయపడ్డారని చెప్పారు. కాగా, ఘర్షణల్లో ఇప్పటి వరకు మొత్తం 105 మంది మరణించారని అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం 1971లో అశువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30ు కోటా కల్పించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కాగా, బంగ్లాలో ఘర్షణలు తీవ్రతరమవుతుండడంతో శుక్రవారం ఎంబీబీఎస్ చదువుతున్న 300 మంది భారతీయులు వెనక్కి వచ్చారు.