Emmanuel Macron: ‘ముద్దు’ వివాదం.. ఇరకాటంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు.. మండిపడుతున్న నెటిజన్లు
ABN , Publish Date - Jul 31 , 2024 | 05:15 PM
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తాజాగా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఓ ‘ముద్దు’ కారణంగా.. నెట్టింట్లో తారాస్థాయి విమర్శలు ఎదుర్కుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉండి..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron) తాజాగా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఓ ‘ముద్దు’ కారణంగా.. నెట్టింట్లో తారాస్థాయి విమర్శలు ఎదుర్కుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉండి.. ఇలా ప్రవర్తించడం సబబేనా అంటూ ఆయన ఛీవాట్లు ఎదుర్కొంటున్నారు. అటు.. ఆయనకు ముద్దు పెట్టిన మహిళా మంత్రిపై కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమైందంటే..
ఒలంపిక్స్ వేడుకల్లో..
ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ (Paris Olympics 2024) వేడుకలకు ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. గతవారం పారిస్‌లోని సెన్ నదిపై.. ఈ ఒలంపిక్ వేడుకల ప్రారంభ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో అధ్యక్షుడు మేక్రాన్‌తో పాటు ఇతర దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. అయితే.. అదే సమయంలో ఎవ్వరూ ఊమించని ఓ పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాన్స్ క్రీడల మంత్రి ఎమిలీ కాస్టెరా (Amelie Castera).. మేక్రాన్‌ను కౌగలించుకుంది. అంతేకాదు.. ఆయన చెంపపై గాఢంగా ముద్దు పెట్టింది. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువు అయ్యింది. ఈ దృశ్యాన్ని ఫ్రెంచ్ మ్యాగజైన్ ‘మాడమ్ ఫిగారో’ క్లిక్ మనిపించి.. ఒక కథనం ప్రచురించింది. ఈ ముద్దు వింతగా ఉందని.. బహుశా ఎమిలీ అందరి దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారేమోనని అందులో రాసుకొచ్చింది.
సోషల్ మీడియాలో విమర్శలు..
మరోవైపు.. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో.. నెట్టింట్లో ఆ ఇద్దరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఒక గొప్ప కార్యక్రమంలో ఇలా అనుచితంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదంటూ తిట్టిపోస్తున్నారు. ఒకరేమో అధ్యక్షులు, మరొకరేమో మంత్రి స్థానంలో ఉన్నారని.. అలాంటి పదవుల్లో ఉన్నవారు ఇలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో చాలా అసభ్యకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం ఆ ఇద్దరి చర్యని సమర్థిస్తున్నారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఎమిలీ గతంలోనూ అథ్లెట్లను ఇలాగే ముద్దు పెట్టుకున్నారని.. ఇప్పుడు ఒలంపిక్ లాంటి విశ్వ క్రీడలకు ఫ్రాన్స్ ఆథిత్యమిస్తున్న ఆనందంలో అలా ముద్దు పెట్టి ఉంటారని చెప్తున్నారు.
ఇతర వివాదాలు..
ఇదిలావుండగా.. ఎమిలీ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో సీన్ నదిలో ఈతకొట్టి.. అందులోని నీళ్లు చాలా శుభ్రంగా ఉన్నాయని, బ్యాక్టీరియాలేమైనా ఉంటాయన్న భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ.. అథ్లెట్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ నీటి నాణ్యతపై ఆందోళనలు తొలగిపోలేదు. ఫలితంగా.. ట్రైయథ్లాన్‌తో పాటు మరికొన్ని ఈవెంట్లను వాయిదా వేయాల్సి వచ్చింది. అటు.. ఈ ఏడాది జనవరిలో ఆమెకు విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఆమె ప్రభుత్వ పాఠశాలలను విమర్శించినందుకు గాను, నెల రోజుల్లోపే ఆ పదవి నుంచి తొలగించారు.
Read Latest International News and Telugu News