Singapore Airlines: ప్రయాణిస్తున్న విమానంలో తీవ్ర కుదుపులు.. ఒకరు మృతి
ABN , Publish Date - May 21 , 2024 | 04:48 PM
విమానయాన ప్రయాణంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లండన్ నుంచి సింగపూర్‌కు వెళ్లా్ల్సిన ‘సింగపూర్ ఎయిర్‌లైన్స్’ విమానం తీవ్ర కుదుపులకు గురయ్యింది. దీంతో విమానం అల్లకల్లోలమైంది. కుదుపుల తీవ్రతకు ఒక ప్రయాణీకుడు మృత్యువాతపడ్డాడు.
విమానయాన ప్రయాణంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లండన్ నుంచి సింగపూర్‌కు వెళ్లా్ల్సిన ‘సింగపూర్ ఎయిర్‌లైన్స్’ విమానం తీవ్ర కుదుపులకు గురయ్యింది. దీంతో విమానం అల్లకల్లోలమైంది. కుదుపుల తీవ్రతకు ఒక ప్రయాణీకుడు మృత్యువాతపడ్డాడు. దాదాపు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక ప్రయాణికుడు చనిపోయినట్టుగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా ధృవీకరించింది. తీవ్ర కుదుపుల కారణంగా విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించింది.
సోమవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి ఎస్‌క్యూ321 విమానం సింగపూర్‌కు బయలుదేరిందని, అయితే మార్గమధ్యంలో తీవ్రమైన కుదుపులకు గురయ్యిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటనలో తెలిపింది. అయితే విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించామని, మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ల్యాండ్ అయ్యిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. బోయింగ్ 777-300ఈఆర్ విమానం కల్లోలానికి గురయ్యిందని, విమానంలో 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారని వివరించింది.
కాగా దురదృష్టవశాత్తూ మరణించిన ప్రయాణికుడి కుటుంబానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంతాపం ప్రకటించింది. బోయింగ్ విమానంలో గాయాలపాలైన ప్రయాణికులు, సిబ్బంది అందరికీ సాధ్యమైన సహాయం అందిస్తామని సంస్థ తెలిపింది. గాయపడ్డవారికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకుగానూ థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని, బ్యాంకాక్‌కు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా పంపించినట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.