ఉక్రెయిన్ మహా దూకుడు!
ABN , Publish Date - Sep 22 , 2024 | 02:39 AM
ఆయుధాగారాలే లక్ష్యంగా రష్యాపై విరుచుకుపడుతోంది ఉక్రెయిన్..! గత బుధవారం ట్వెర్ ప్రావిన్స్ తుర్పెట్ గ్రామంలో ఉన్న భారీ డిపోను ధ్వంసం చేసి కలకలం రేపింది..!
రష్యాపై మళ్లీ దాడి మంటల్లో ఆయుధాగారాలు..!
కీవ్, సెప్టెంబరు 21: ఆయుధాగారాలే లక్ష్యంగా రష్యాపై విరుచుకుపడుతోంది ఉక్రెయిన్..! గత బుధవారం ట్వెర్ ప్రావిన్స్ తుర్పెట్ గ్రామంలో ఉన్న భారీ డిపోను ధ్వంసం చేసి కలకలం రేపింది..! శుక్రవారం మరోరెండో డిపోలను లక్ష్యంగా చేసుకుంది. ట్వెర్‌కు సమీపంలో, టిఖోరెట్స్క్ జిల్లా కమెన్నీలో ఉన్న ఆయుధాగారాలపై డ్రోన్లతో దాడికి దిగింది. ఇది ఉక్రెయిన్ సరిహద్దులో రష్యాకు చెందిన దక్షిణ క్రస్నోదర్ ప్రాంతంలో ఉంది. డ్రోన్ దాడి అనంతరం పేలుళ్లు రాత్రంతా కొనసాగాయని, భారీగా పొగ కమ్మేసిందని స్థానికులు తెలిపారు. స్థానిక గవర్నర్ కూడా ఉక్రెయిన్ దాడి ధ్రువీకరించారు. ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. రెండు డ్రోన్లను కూల్చివేశామని చెప్పారు. అయితే, ఒకదాని నుంచి పడిన పదార్థాలు పేలుడుకు కారణమయ్యాయని పేర్కొన్నారు. టిఖోరెట్స్క్ ఆయుధాగారాన్ని ధ్వంసం చేశామని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. అందులోనే పేలుడు జరిగినట్లు చెప్పాయి. కాగా, టిఖోరెట్స్క్‌లో ఉత్తర కొరియా సరఫరా చేసిన ఆయుధాలు ఉన్నట్లు గతంలో అమెరికా తెలిపింది. ఉత్తర రష్యా ట్వెర్ రీజియన్‌లోని ఒక్టియాబ్రిస్కీలో ఉన్న ఆయుధాగారమూ మంటల్లో చిక్కుకుంది. ఇది గత బుధవారం దాడి జరిగిన ట్రోపెట్స్‌కు అతి దగ్గరగా ఉండడం గమనార్హం. మరోవైపు భద్రతా కారణాల రీత్యా టెలిగ్రామ్ చానల్ వాడకాన్ని నిలిపివేయాలని ఉక్రెయిన్ నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి సైబర్ దాడుల ముప్పు తప్పించుకునేందుకు ఈ ఆలోచన చేసింది.