Share News

ఈ బైడెన్‌ మాకొద్దు! ఎందుకంటే..?

ABN , Publish Date - Jun 29 , 2024 | 05:53 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్‌ (81) అభ్యర్థిత్వం డోలాయమానంలో పడింది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(78)తో గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం) జరిగిన ప్రథమ చర్చలో.. పలు ప్రశ్నలకు జవాబులివ్వలేక తడబడిపోయారు.

ఈ బైడెన్‌ మాకొద్దు! ఎందుకంటే..?
Biden

‘అధ్యక్ష’ అభ్యర్థి మార్పునకు డెమోక్రాట్ల పట్టు

ట్రంప్‌తో చర్చలో అధ్యక్షుడి తడబాటు

81 ఏళ్ల వయసులో ఆయనకు అభ్యర్థిత్వం

ఎందుకని సొంత పార్టీలోనే ఆగ్రహం


వాషింగ్టన్‌, జూన్‌ 28: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్‌ (81) అభ్యర్థిత్వం డోలాయమానంలో పడింది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(78)తో గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం) జరిగిన ప్రథమ చర్చలో.. పలు ప్రశ్నలకు జవాబులివ్వలేక తడబడిపోయారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, వలసలు, ఎకానమీ తదితర అంశాలకు సంబంధించి తన డెమోక్రాటిక్‌ పార్టీ విధానాలు, నిర్ణయాలపై సమర్థంగా వాదన వినిపించలేకపోయారు. ట్రంప్‌ మాత్రం ఆత్మవిశ్వాసంతో జవాబులిచ్చారు. తన పాలసీలను విడమరచి చెప్పగలిగారు. దీంతో బైడెన్‌ రెండోసారి గెలవడం అనుమానంగా మారింది. దరిమిలా ఆయన్ను పోటీ నుంచి తప్పించేందుకు పాలక డెమోక్రాటిక్‌ పార్టీలో పెద్దఎత్తున మంతనాలు జరుగుతున్నాయి. అంతేకాదు.. ఆ పార్టీకి భూరి విరాళాలిచ్చిన దాతలు సైతం అభ్యర్థి మార్పును కోరుతుండడంతో సీనియర్‌ డెమోక్రాట్లకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. వాస్తవానికి బైడెన్‌ రెండోసారి బరిలో నిలుస్తానని ప్రకటించినప్పుడే పార్టీలో వ్యతిరేకత వ్యక్తమైంది. బైడెన్‌కు జ్ఞాపక శక్తి మందగించింది. తరచూ వేదికపై తడబడుతుండడం, ఎవరో ఒకరి ఆసరా లేకుండా మాట్లాడలేకపోవడం తదితరాల నేపథ్యంలో వేరే అభ్యర్థిని ఎంచుకుందామని పలువురు సీనియర్లు అప్పట్లోనే పట్టుబట్టారు. 81 ఏళ్ల వయసులో ఆయన గౌరవప్రదంగా వైదొలగి.. సమర్థ నేతకు అవకాశమివ్వాలని వాదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఈ ఏడాది నవంబరు 5న జరుగనుంది. పోటీచేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు పలువురు ప్రముఖులు, సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో బహిరంగ చర్చలో పాల్గొనడం రివాజు. గతంలో మూడుసార్లు ఈ చర్చలు జరిగేవి. ఈసారి ట్రంప్‌, బైడెన్‌ రెండింటికే అంగీకరించారు.


తనకు తానుగా తప్పుకొంటేనే..

శుక్రవారం నాటి చర్చ సీఎన్‌ఎన్‌ ఆధ్వర్యంలో జరుగగా.. త్వరలో జరిగే రెండో చర్చను ‘ఏబీసీ న్యూస్‌’ నిర్వహించనుంది. శుక్రవారం చర్చలో బైడెన్‌ వయోభారంతో గలగలా మాట్లాడలేకపోయారు. పోడియం వద్దకు వెళ్లేప్పుడే బలహీనంగా వణుకుతూ కనిపించారు. దీంతో, చర్చ మొదలైన కొద్ది నిమిషాలకే డెమోక్రాట్లలో ఆందోళన చెలరేగింది. అయితే డెమోక్రాట్లే తమ అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేస్తున్నా.. బైడెన్‌ తనంతట తాను వైదొలిగితే తప్ప ఈ సమయంలో అదంత తేలిక కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రతినిధుల ఎంపిక కోసం జరిగే ప్రైమరీ ఎన్నికలు పూర్తయిపోయాయి. డెమోక్రాటిక్‌ పార్టీ నిబంధనల ప్రకారం.. రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు బైడెన్‌ స్వయంగా చెబితే తప్ప.. వీరంతా ఆయనకే మద్దతివ్వాల్సి ఉంటుంది. అయితే అధ్యక్షుడు అందుకు సుముఖంగా లేరు.


అబద్ధాల ట్రంప్‌..

డిబేట్‌లో ట్రంప్‌ కూడా గొప్పగా మాట్లాడిందేమీ లేదని.. ఎప్పటిలాగే అబద్ధాలు చెప్పారని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అభిపాయ్రపడ్డారు. సత్యం తనవైపే ఉన్నప్పటికీ.. వయోభారం కారణంగా బైడెన్‌ తడబడ్డారని. తెలిపారు. గత ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని, ఆ సమయంలో క్యాపిటల్‌ హిల్‌పై దాడిలో తన ప్రమేయం ఏమీ లేదని ట్రంప్‌ మొండిగా వాదించారు.

Updated Date - Jun 29 , 2024 | 07:49 AM