Share News

132 Seater Bus: 132 సీటర్.. ట్రైన్ లాంటి సరికొత్త బస్సులు.. విమానం తరహాలో సౌకర్యాలు

ABN , Publish Date - Jul 03 , 2024 | 05:14 PM

విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి చూసినప్పుడల్లా.. భారతదేశంలో ఇలాంటివి..

132 Seater Bus: 132 సీటర్.. ట్రైన్ లాంటి సరికొత్త బస్సులు.. విమానం తరహాలో సౌకర్యాలు
132 Seater Bus

విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి చూసినప్పుడల్లా.. భారతదేశంలో ఇలాంటివి ఎప్పుడు వస్తాయో? అని మనం అనుకుంటుంటాం. అయితే.. ఇప్పుడు ఆ నిరీక్షణకు త్వరలోనే చెక్ పడబోతోంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాలా నిజం. కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


132 సీటర్ బస్సు

132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని.. ఇందుకోసం నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోందని నితిన్ గడ్కరీ చెప్పారు. తాను చెక్ రిపబ్లిక్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఉండటాన్ని తాను చూశానని అన్నారు. అలాంటి బస్సులను భారత్‌లో ఎందుకు తీసుకురాకూడదని అనిపించిందని పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చలు జరిపి, టాటా సహకారంతో నాగ్‌పుర్‌లో ఓ పైలట్‌ ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 132 మంది కూర్చునే విధంగా బస్సును రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇంధనంతో కాకుండా బ్యాటరీతో నడిచేలా వీటిని తయారు చేస్తున్నామన్నారు. ప్రతి ఛార్జింగ్‌కి 40 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుందని.. కేవలం 40 సెకన్లు ఛార్జింగ్‌ చేస్తే మరో 40 కి.మీ. వెళ్లొచ్చని చెప్పారు. దీంతో.. ఒక్క కిలోమీటర్‌కి రూ.40 మాత్రమే ఖర్చవుతుందని వివరించారు.


సౌకర్యాలు

అంతేకాదు.. ఈ బస్సులో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని నితిన్ గడ్కరీ తెలిపారు. ఎలాగైతే విమానంలో సీటింగ్ ఉంటుందో.. అలాగే ఇందులోనూ సీట్లు అమర్చబడి ఉంటాయన్నారు. సీటు ముందు ల్యాప్‌టాప్ పెట్టుకునే సౌలభ్యమూ ఉంటుందన్నారు. ఎయిర్ హోస్టెస్‌లాగా బస్ హోస్టెస్ కూడా ఉంటారని.. వీళ్లు పండ్లు, ఆహారం, శీతల పానీయాలు అందిస్తారన్నారు. డీజిల్‌ బస్సుతో పోలిస్తే.. దీని నిర్వహణకు 30 శాతం వరకు ఖర్చు తగ్గుతుందని వెల్లడించారు. మన దేశంలో కాలుష్యం అనేది అతిపెద్ద సమస్యగా మారిందని.. ఈనేపథ్యంలో వ్యక్తిగత, ప్రజారవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయని చెప్పుకొచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 05:14 PM