Share News

Gas Cylinder Blast: అక్రమ గ్యాస్ సిలిండర్‌ గోదాములో పేలుడు.. ఆరుగురికి గాయాలు

ABN , Publish Date - Dec 07 , 2024 | 09:33 AM

అక్రమ గ్యాస్ గోదాములో అనుకోకుండా భారీ పేలుడులో సంభవించింది. దీంతో నలుగురు కార్మికులతోపాటు ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పోలీసుల కుమ్మక్కుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Gas Cylinder Blast: అక్రమ గ్యాస్ సిలిండర్‌ గోదాములో పేలుడు.. ఆరుగురికి గాయాలు
Gas Cylinder Blast

అక్రమంగా ఓ చోట గోదాములో ఎల్‌పీజీ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ట్రామా సెంటర్‌లో చేర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలోని దుబగ్గలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.


పెద్ద శబ్ధంతో పేలుడు

వారం రోజుల క్రితం మర్దాపూర్‌లో నివాసం ఉంటున్న రోహిత్ గుప్తా ఇంట్లో ఈ ఎల్‌పీజీ అక్రమ గోదాం నిర్మించినట్లు పలువురికి తెలిసినట్లు డీసీపీ వెస్ట్ ఓంవీర్ సింగ్ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే వారు శుక్రవారం రాత్రి వాణిజ్య సిలిండర్ల నుంచి డొమెస్టిక్ సిలిండర్లకు గ్యాస్ రీఫిల్ చేస్తున్నారు. ఆ సమయంలో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించిందన్నారు. పేలుడు చాలా శక్తివంతంగా జరగడంతో ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారని తెలిపారు. అంతేకాదు పేలుడు కారణంగా గోదాములోని గోడలకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయని వెల్లడించారు.


ఆడుకుంటున్న చిన్నారులకు

ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడగా, పక్కనే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మోహిత్ గుప్తా (24), శోభిత్ గుప్తా (22), సోమనాథ్ విశ్వకర్మ (33), రంజిత్, దిశాన్ (5), అయేషా (7) ఉన్నారు. ఘటన అనంతరం గోదాం యజమాని అశోక్ గుప్తా అక్కడి నుంచి పరారయ్యాడు. అగ్నిమాపక దళం, పోలీసు బృందాలు ఘటనా స్థలం నుంచి భారీగా గ్యాస్ సిలిండర్లను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. అయితే గ్యాస్‌ సిలిండర్‌ పేలలేదని ఆయన అన్నారు. సిలిండర్ పగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని, ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందన్నారు.


పోలీసుల హస్తం ఉందా..

మరోవైపు గోదాము యజమాని ఎవరికీ అనుమానం రాకుండా కార్మికులను తరచూ మార్చేవారని స్థానికులు అంటున్నారు. అక్రమ గోదాం గురించి స్థానిక పోలీసులకు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ గోదాం నిర్వహణలో పోలీసుల హస్తం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ గ్యాస్ గోదాములను మూసివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

దీంతోపాటు బాధ్యులైన అధికారులు, నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షిస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని అంటున్నారు. ప్రజలు ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి, ఇటు కార్మికుల భద్రత, సమీపంలోని ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి:

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More National News and Latest Telugu News

Updated Date - Dec 07 , 2024 | 10:31 AM