Delhi: ఘోరం.. 633 మంది భారతీయ విద్యార్థులు మృతి
ABN , Publish Date - Jul 27 , 2024 | 11:18 AM
గడిచిన 5 ఏళ్లలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన 633 మంది విద్యార్థులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
ఢిల్లీ: గడిచిన 5 ఏళ్లలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన 633 మంది విద్యార్థులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. కెనడాలో అత్యధికంగా 172 మంది చనిపోయారని మొత్తంగా 41 దేశాలు కలిపి కనీసం 633 మంది భారతీయ విద్యార్థులు మరణించారని వివరించింది. కేరళ ఎంపీ కోడికున్నిల్ సురేష్ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాలు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సహజ కారణాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలు, వైద్య అత్యవసర పరిస్థితులు విద్యార్థుల మరణాలకు కారణాలుగా తేలాయి. కెనడా తరువాతి స్థానంలో US (108), UK (58), ఆస్ట్రేలియా (57), రష్యా (37), జర్మనీ (24) ఉన్నాయి. దాయాది పాకిస్తాన్‌లో కూడా ఒక భారతీయ విద్యార్థి మృతి చెందాడు. దాడి / హింస కారణంగా కెనడాలో 9, అమెరికాలో 6, ఆస్ట్రేలియా, చైనా, యూకే, కిర్గిజ్స్తాన్‌లలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 19 మరణాలు సంభవించాయి.
భారత కార్యాలయాల సత్వర స్పందన..
విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి భారత కార్యాలయాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాయని, నేరస్థులకు శిక్ష పడేలా చూస్తాయని మంత్రి వెల్లడించారు. ఇటీవల చేపట్టిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా (ఉక్రెయిన్), ఆపరేషన్ అజయ్(ఇజ్రాయెల్) ద్వారా ప్రపంచదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి చేర్చామని ఆయన వివరించారు.
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు MADAD పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారి సమస్యల విషయంలో భారత ఏజెన్సీలు వెంటనే స్పందించే అవకాశం ఉంటుందని తెలిపారు. 2024నాటికి 1.33 మిలియన్ల మంది భారత విద్యార్థులు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు.
పెరుగుతున్న సంఖ్య
గడిచిన మూడేళ్లలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2022లో ఈ సంఖ్య 0.75 మిలియన్లుగా, 2023లో 0.93 మిలియన్లకు చేరుకోగా తాజాగా 1.33 మిలియన్లకు చేరుకుంది. విదేశాల్లో కష్టాల్లో ఉన్న విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా(ఉక్రెయిన్), ఆపరేషన్ అజయ్(ఇజ్రాయెల్) విజయవంతమైనట్లు చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి ఈ మధ్య కాలంలో అనేక మంది విద్యార్థులు భారత్‌కి తిరిగి వస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 101 దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులకు సంబంధించి MEA సమర్పించిన డేటా ప్రకారం.. కెనడాలో అత్యధికంగా 4.27 లక్షలు, అమెరికాలో 3.37 లక్షలు, UKలో 1.85 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఆస్ట్రేలియాలో 1.22 లక్షలు, జర్మనీలో 42 వేల 997, యుఎఇలో 25 వేలు, రష్యాలో 24 వేల 940 మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. చైనాలో 8 వేల 580 మంది(హాంకాంగ్‌తో సహా), న్యూజిలాండ్‌లో 7 వేల 300, నేపాల్‌లో 2 వేల 134, సింగపూర్‌లో 2 వేలు, జపాన్‌లో 1,532, ఇరాన్‌లో 1,020 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
పాకిస్థాన్‌లో 14 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని ప్రభుత్వం తెలిపింది. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో ఇప్పటికీ 2,510 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నట్లు వెల్లడించింది.
For Latest News and National News click here