Share News

Tamil Nadu: బాణాసంచా కర్మాగారంలో భారీ విస్ఫోటం

ABN , Publish Date - May 10 , 2024 | 04:35 AM

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ విస్ఫోటం సంభవించింది. హఠాత్తుగా సంభవించిన పేలుడు కారణంగా ఐదుగురు మహిళలు సహా 8మంది దుర్మరణం చెందారు.

Tamil Nadu: బాణాసంచా కర్మాగారంలో భారీ విస్ఫోటం

  • మంది దుర్మరణం.. 14 మందికి తీవ్ర గాయాలు

  • ఐదుగురి పరిస్థితి విషమం.. శివకాశిలో ఘటన

చెన్నై, మే 9 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ విస్ఫోటం సంభవించింది. హఠాత్తుగా సంభవించిన పేలుడు కారణంగా ఐదుగురు మహిళలు సహా 8మంది దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లోనూ మహిళలే అధికంగా ఉన్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుత్తంగల్‌ స్టాండర్డ్‌ కాలనీకి చెందిన శరవణన్‌ (55) సెంగమలపట్టిలో ‘సుదర్శన్‌ ఫైర్‌ వర్క్స్‌’ పేరుతో బాణాసంచా తయారీ కర్మాగారం నిర్వహిస్తున్నాడు. కర్మాగారంలో 20 గదులుండ గా.. 80 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు.


కర్మాగారంలోని ఓ గదిలో గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మిగిలిన గదుల్లోని బాణసంచా కూడా పేలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 7గదులు కుప్పకూలగా, ఆ గదుల్లో పని చేస్తున్న కార్మికుల శరీరాలు ఛిద్రమయ్యాయి. కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీలు లేకుండా శరీరాలు తునాతునాకలయ్యాయి. మరికొందరి శరీరమంతా కాలుతుండగా కొన ప్రాణాలతో బయటపడగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన 16 మందిని శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


అక్కడ చికిత్స పొందుతూ మహిళ సహా ఇద్దరు మరణించారు. మృతులను చెన్నైకి చెందిన రమేశ్‌, సిలోన్‌ కాలనీకి చెందిన ముత్తు, మురుగన్‌ కాలనీకి చెందిన భాగ్యం (55), పారైపట్టికి చెందిన అవుడయమ్మాళ్‌ (80), శివకాశి నెహ్రూజీ నగర్‌కు చెందిన మారియమ్మాళ్‌ (50), మేల్‌ చిన్నయాపురానికి చెందిన విజయకుమార్‌ (28), చొక్కలింగపురానికి చెందిన కాళీశ్వరన్‌, శివకాశి సిలోన్‌ కాలనీకి చెందిన లక్ష్మి (40)గా పోలీసులు గుర్తించారు. కర్మాగారం యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - May 10 , 2024 | 04:35 AM