Aadhaar card: ఆధార్ కార్డు ద్వారా వేతనం బట్వాడా
ABN , Publish Date - Jan 02 , 2024 | 09:22 AM
వంద రోజుల ఉపాధి హామీ పథకం కూలీలకు ఆధార్ కార్డు(Aadhaar card) ద్వారా కూలి బట్వాడా చేసే ప్రక్రియ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులున్నారు.
ఐసిఎఫ్(చెన్నై): వంద రోజుల ఉపాధి హామీ పథకం కూలీలకు ఆధార్ కార్డు(Aadhaar card) ద్వారా కూలి బట్వాడా చేసే ప్రక్రియ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులున్నారు. ఆధార్ అనుసంధానం చేసిన కార్మికులకు వేతనం నేరుగా అందించేందుకు కేంద్రప్రభుత్వం(Central Govt) చర్యలు చేపట్టింది. ఉపాధి పథకం కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు గత ఏడాది ఐదు సార్లు అవకాశం కల్పించగా, ఈ గడువు ఆదివారంతో ముగిసింది. మూడేళ్లలో ఒకరోజైనా పనిచేసి ఉంటే వారు విధుల్లో ఉన్నట్లు పరిగణించబడతారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ ప్రక్రియ ప్రకారం నమోదు చేసిన 25.25 కోట్ల మంది కార్మికుల్లో 14.35కోట్ల మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు. రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం పంపిన సర్క్యులర్‌లో... అర్హత ఉండి నమోదు చేయని వారిని మళ్లీ పథకంలో చేర్చాలని పేర్కొంది. గత 21 నెలల్లో 7.6 కోట్ల మంది పేర్లు తొలగించగా, వారు ఆధార్ నెంబరు అనుసంధానం చేస్తే, వారి ఖాతాకు వేతనం జమ అవుతుంది. సోమవారం నుంచి ఆధార్‌నెంబరు నమోదుచేసుకున్న వారికి వేతనం బట్వాడా అమలుకు వచ్చింది.