Lok sabha polls: ఢిల్లీ, హర్యానా అభ్యర్థులను ప్రకటించిన 'ఆప్'
ABN , Publish Date - Feb 27 , 2024 | 04:48 PM
లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, హర్యానా నుంచి పోటీచేసే అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మంగళవారంనాడు ప్రకటించింది. ఢిల్లీ నుంచి నలుగురు, హర్యానా నుంచి ఒక అభ్యర్థి పేరును ఆప్ ప్రకటించంది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha elections) ఢిల్లీ (Delhi), హర్యానా (Haryana) నుంచి పోటీచేసే అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మంగళవారంనాడు ప్రకటించింది. ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎమ్మెల్యే కులదీప్ కుమార్, న్యూఢిల్లీ నుంచి ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి పోటీ చేయనున్నారు. వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ మాజీ ఎంపీ మహాబల్ మిశ్రా పోటీ చేయనున్నారు. సౌత్ ఢిల్లీ నుంచి మరో ఎమ్మెల్యే రామ్ పహల్వాన్ పోటీ చేస్తారు. కాగా, హర్యానాలోని కురుక్షేత్ర నుంచి తమ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ సుశీల్ గుప్తా పేరును ఆప్ ప్రకటించింది.
'ఆప్' అభ్యర్థుల పేర్లను ప్రకటించిన అనంతరం మీడియాతో ఆ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఈరోజు ప్రకటించామని చెప్పారు. ఢిల్లీ నుంచి నలుగురు, హర్యానా నుంచి నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించామన్నారు. ఢిల్లీలో కుల్‌దీప్ కుమార్ ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారని, ఆయన రిజర్వ్‌డ్ కేటగిరికి చెందిన వారని అన్నారు. జనరల్ సీటులో రిజర్వ్‌డ్ క్యాటగిరి అభ్యర్థిని నిలబెట్టడమనే పెద్ద నిర్ణయాన్ని ఆప్ తీసుకుందని తెలిపారు.