AAP : బీజేపీ నియంతృత్వాన్ని వీడాలి
ABN , Publish Date - Sep 14 , 2024 | 03:26 AM
అధినేత కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడంపై ఆప్ సంతోషం వ్యక్తం చేసింది. కేజ్రీలాంటి నిజాయతీపరుడిని జైల్లో పెట్టినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీని డిమాండ్ చేసింది.
సత్యం ఓడిపోదు: ఆప్.. పదేళ్లుగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం: కాంగ్రెస్
ఇది రాజ్యాంగం సాధించిన విజయం: ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: అధినేత కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడంపై ఆప్ సంతోషం వ్యక్తం చేసింది. కేజ్రీలాంటి నిజాయతీపరుడిని జైల్లో పెట్టినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీని డిమాండ్ చేసింది. సత్యానికి సమస్యలు ఎదురవొచ్చని.. ఎప్పటికీ ఓడిపోదని పేర్కొంది. బీజేపీ అబద్ధాలు బయటపడ్డాయని.. ఇకనైనా నియంతృత్వం వీడాలని హితవు పలికింది. ఈడీ, సీబీఐలు బీజేపీ చెప్పినట్లు పలికే చిలుకలు అని అభివర్ణించింది. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేసింది. అసత్యాలు, కుట్రలపై నిజం గెలిచిందని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. కష్ట కాలంలో తమకు అండగా నిలిచిన కార్యకర్తలకు కేజ్రీ సతీమణి సునీత ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని తక్కువ సీట్లకే పరిమితం చేశారని తెలిపింది. కేజ్రీకి బెయిల్ లభించడాన్ని రాజ్యాంగం సాధించిన విజయం అని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. రాజ్యాంగ వ్యతిరేకులైన బీజేపీకి చెంపపెట్టు అని పేర్కొన్నారు. కాగా, కేజ్రీకి వచ్చింది షరతులతో కూడిన బెయిల్ మాత్రమేనని బీజేపీ పేర్కొంది. నిన్నటివరకు ఆయన జైల్‌వాలా అని.. నేడు బెయిల్‌వాలా అయ్యారని ఎద్దేవా చేసింది. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని.. కానీ, నైతికత ఏమాత్రం లేని ఆయన ఆ పని చేయరని వ్యాఖ్యానించింది.