Abdul Rehman Makki: 26/11 ముంబై పేలుళ్ల నిందితుడు అబ్దుల్ రెహ్మన్ మక్కీ మృతి
ABN , Publish Date - Dec 28 , 2024 | 06:20 AM
నిషేధిత జమాత్-ఉద్-దవా ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్, ముంబై పేలుళ్ల నిందితుడు అబ్దుల్ రెహ్మన్ మక్కీ పాకిస్థాన్‌లో మృతి చెందాడు.
న్యూఢిల్లీ, డిసెంబరు 27: నిషేధిత జమాత్-ఉద్-దవా ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్, ముంబై పేలుళ్ల నిందితుడు అబ్దుల్ రెహ్మన్ మక్కీ పాకిస్థాన్‌లో మృతి చెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం గుండెపోటుతో చనిపోయాడు. 2008 నవంబరు 26న జరిగిన ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు అబ్దుల్ రెహ్మన్ మక్కీ బావమరిది.
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో రెహ్మన్ మక్కీకి యాంటీ టెర్రరిజం కోర్టు 2020లో ఆరునెలల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 2023లో ఐక్యరాజ్య సమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి, అతడి ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు అతడి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది.