Actor Kamal Haasan: తేల్చిచెప్పేశారు.. ఏ కూటమిలో చేరినా ‘టార్చిలైట్’ తోనే పోటీ చేస్తాం..
ABN , Publish Date - Feb 09 , 2024 | 11:04 AM
ఏ కూటమిలో చేరినా ‘టార్చిలైట్’ చిహ్నంపైనే పోటీచేస్తామని, లేని పక్షంలో ప్రత్యేక చిహ్నంతో పోటీ చేస్తామని ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్(Kamal Haasan) స్పష్టం చేశారు.
చెన్నై: ఏ కూటమిలో చేరినా ‘టార్చిలైట్’ చిహ్నంపైనే పోటీచేస్తామని, లేని పక్షంలో ప్రత్యేక చిహ్నంతో పోటీ చేస్తామని ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్(Kamal Haasan) స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కమల్‌హాసన్ నేతృత్వంలోని ఎంఎన్‌ఎం పార్టీ డీఎంకే కూటమిలో చేరే అవకాశముందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇరుపార్టీల మధ్య చర్చలు జరుగుతుండగా కోయంబత్తూర్, దక్షిణ చెన్నై కోరుకుంటోంది. అయితే ఇందులో ఒక దానిని మాత్రం ఇచ్చేందుకు డీఎంకే సుముఖంగా వున్నట్లు సమాచారం. ఒకవేళ తమ కూటమిలో సీటు కేటాయిస్తే, తమ చిహ్నమైన ‘ఉదయించే సూర్యుడు’పై పోటీచేయాలని డీఎంకే స్పష్టం చేసినట్లు సమాచారం. గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే కూటమిలో డీపీఐ పార్టీకి రెండు నియోజకవర్గాలు కేటాయించగా, వాటిలో ఒకస్థానంలో ఆ పార్టీ డీఎంకే చిహ్నంపై పోటీచేసింది. అలాగే, కమల్‌హాసన్ పార్టీకి కూడా ఈ నిబంధనతోనే సీటు కేటాయించే అవకాశముందని సమాచారం. కానీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎంఎన్‌ఎంకు ‘టార్చిలైట్‘ చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు గత డిసెంబరు 17వ తేది లేఖతో పాటు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు ఏ పార్టీతో కూటమి ఏర్పాటైనా ‘టార్చిలైట్’ చిహ్నంపై పోటీచేస్తామని కమల్‌హాసన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆ చిహ్నాం ఎన్నికల కమిషన్ కేటాయించని పక్షంలో, ప్రత్యేక చిహ్నంతో పోటీచేస్తామని కమల్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.