Share News

Delhi: ఎన్నికలైపోయాయ్.. ధరలు పెరుగుతున్నాయ్.. తాజాగా వాటి రేటు పెంపు

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:42 PM

లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో నిత్యావసర ధరల పెరుగుదల మొదలైంది. అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెరగ్గా.. తాజాగా మరో కంపెనీ ధర పెంచేసింది. 15 నెలలుగా పాల ఉత్పత్తుల ఖర్చు పెరిగిపోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు మదర్ డెయిరీ(Mother Dairy) సోమవారం ప్రకటించింది.

Delhi: ఎన్నికలైపోయాయ్.. ధరలు పెరుగుతున్నాయ్.. తాజాగా వాటి రేటు పెంపు

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో నిత్యావసర ధరల పెరుగుదల మొదలైంది. అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెరగ్గా.. తాజాగా మరో కంపెనీ ధర పెంచేసింది. 15 నెలలుగా పాల ఉత్పత్తుల ఖర్చు పెరిగిపోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు మదర్ డెయిరీ(Mother Dairy) సోమవారం ప్రకటించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో పాటు మదర్‌డెరీ అందుబాటులో ఉన్న మార్కెట్‌లలో పెరిగిన ధరలు వర్తిస్తాయి.

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు పెద్ద పాల ఉత్పత్తి కంపెనీలు ధరలు పెంచడం గమనార్హం. ఢిల్లీ-NCRలో మదర్ డైరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ప్రస్తుతం లీటరుకు రూ.68, టోన్డ్, డబుల్ టోన్డ్ మిల్క్‌లు రూ.56, రూ.50గా ఉన్నాయి. గేదె, ఆవు పాల ధరలు లీటరుకు రూ.72, రూ.58 కి పెంచారు.


టోకెన్ పాలు (బల్క్ వెండెడ్ మిల్క్) లీటరుకు రూ.54 చొప్పున అమ్ముతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రోజుకు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తున్న మదర్ డెయిరీ, 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా పాల ధరలను సవరించింది. దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పాల ఉత్పత్తిపై పడిందని అందుకే పెంపు తప్పట్లేదని మదర్ డెయిరీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉష్ణోగ్రతల ప్రభావంతో పాల సేకరణ సగటున 75- 80 శాతం తగ్గిందని తెలిపింది.


అమూల్‌ పాల పెంపు..

మదర్ డెయిరీ ధర పెంపుదలకు ముందే అమూల్‌ పాల ధర పెరిగింది. లీటర్‌పై రూ.2 పెరగనున్నట్లు, అన్ని వేరియంట్లకు ఇది వర్తించనున్నట్లు గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ తెలిపింది. సోమవారం(జూన్‌ 3) నుంచే దేశవ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. పాల సేకరణ, ఉత్పత్తిలో పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొనే ధరల్ని పెంచుతున్నట్లు సంస్థ ఎండీ జయెన్‌ మెహతా పేర్కొన్నారు.

పాలు, పాల ఉత్పత్తుల కోసం వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను అమూల్ పాల ఉత్పత్తిదారులకు చెల్లిస్తుంది. ధరల పెరుగుదల పాల ఉత్పత్తిదారులకు లాభాలు సమకూరుస్తుందని.. పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తుందని అమూల్ చెబుతోంది.

For Latest News and National News click here

Updated Date - Jun 03 , 2024 | 12:42 PM