Shiv Sena split case: స్పీకర్ తీర్పుపై సస్పెన్స్.. సీఎం బిగ్ స్టేట్‌మెంట్
ABN , Publish Date - Jan 10 , 2024 | 03:46 PM
శివసేన ఉద్ధవ్ థాకరే, శివసేన షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ కీలకమైన తీర్పును ప్రకటించనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేశారు.''మాకు మెజారిటీ ఉంది'' అని ధీమా వ్యక్తం చేశారు.
ముంబై: శివసేన ఉద్ధవ్ థాకరే (Shiv Sena UBT), శివసేన షిండే (Shiv Sena Shinde) వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల (disqualification pleas)పై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ (Rahul Narwekar) కీలకమైన తీర్పును ప్రకటించనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేశారు.''మాకు మెజారిటీ ఉంది'' అని ధీమా వ్యక్తం చేశారు.
మాదే నిజమైన శివసేన..
''నేను చెప్పదలచుకున్నది ఒకటే. మాకు మెజారిటీ ఉంది. విధాన సభలో 67 శాతం, లోక్‌సభలో 75 శాతం మెజారిటీ ఉంది. మాకు 13 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకున్న మెజారిటీ కారణంగానే మమ్మల్ని నిజమైన శివసేనగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ధనస్సు-బాణం గుర్తు కేటాయించింది. మెరిట్ ఆధారంగా మమ్మల్ని స్పీకర్ పాస్ చేస్తారనే ఆశాభావంతో ఉన్నాం'' అని ఏక్‌నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
గత ఏడాది శివసేన ఉద్ధవ్ వర్గంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఉద్ధవ్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్రలో కుప్పకూలింది. షిండే ముఖ్యమంత్రిగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని థాకరే వర్గం స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా, తమదే నిజమైన శివసేన అంటూ థాకరే వర్గంపై వేటు వేయాలని షిండే వర్గం సైతం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఉభయ వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్పీకర్ నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానం జనవరి 10వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పుకు మూడు రోజుల ముందే స్పీకర్ ముఖ్యమంత్రి షిండేను కలవడంపై ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. అయితే తన చర్యను నార్వేకర్ సమర్ధించుకున్నారు. స్పీకర్ ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రిని కలుస్తారో థాకరేకు తెలియదా అని నిలదీశారు. ఇప్పటికీ ఆయన (ఉద్ధవ్) ఆరోపణలు చేస్తున్నారంటే ఆయన ఉద్దేశమేమిటో చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. అనర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్నప్పుడు స్పీకర్ ఇతర పనులు చేయకూడదనే రూలు ఏమీ లేదన్నారు.