ఢిల్లీ డేంజర్
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:04 AM
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. విజిబులిటీ స్థాయులు దారుణంగా పడిపోతున్నాయి.
500 దాటిన గాలి నాణ్యత సూచీ
ప్రపంచంలోనే కాలుష్య నగరంగా దేశ రాజధాని
యూపీపైనా తీవ్ర ప్రభావం.. పలు చోట్ల వాహనాల ఢీ
హరియాణా సహా 7 రాష్ట్రాలకు పొగమంచు హెచ్చరికలు
నవంబరు-జనవరి నెలల మధ్య నివాస యోగ్యమే కాదు
ఇంకా ఢిల్లీని రాజధానిగా కొనసాగించాలా?: శశి థరూర్
న్యూఢిల్లీ/లఖ్‌నవూ, నవంబరు 19: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. విజిబులిటీ స్థాయులు దారుణంగా పడిపోతున్నాయి. గాలి నాణ్యత(ఏక్యూఐ) కూడా కొన్ని చోట్ల 500 మార్కును దాటింది. సగటు గాలి నాణ్యత 494గా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డుకెక్కింది. ఎంతలా అంటే.. రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే.. ఢిల్లీలో 4 రెట్ల అధిక కాలుష్యం కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎక్స్‌లో తీవ్రంగా స్పందించారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాల్సిన వసరం ఉందా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఈ విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నాం. నవంబరు-జనవరి నెలల మధ్య అసలు ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండడం లేదు. మిగతా సమయాల్లోనూ జీవనం కొనసాగించడం అంతంతమాత్రమే..! ఈ పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా రాజధానిగా కొనసాగించాలా?’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా.. వాయు కాలుష్య తీవ్రత, విజిబులిటీ దారుణంగా ఉండడంతో ఢిల్లీలో 22 రైళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
గాలి నాణ్యత పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనూ దారుణంగా తయారైంది. మంగళవారం ఉదయం నోయిడాలో ఈస్టర్న్-పెరిఫెరల్ ఎక్స్‌ప్రె్‌సవేపై వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు మృతిచెందగా.. డజన్ల కొద్దీ వాహనదారులు గాయపడ్డారు. పానిపట్ నుంచి మథుర వెళ్తున్న ఓ బస్సు.. రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రక్కులను ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరోవైపు, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, యూపీ, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ పొగమంచు హెచ్చరికలను జారీ చేసింది. హరియాణాలో గాలి నాణ్యత పడిపోవడంతో.. బడులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాజస్థాన్‌లో చలి తీవ్రత పెరిగింది. సికార్‌లోని ఫతేపూర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీలుగా నమోదయ్యాయి. భరత్‌పూర్‌లో విజిబిలిటీ 50 మీటర్లకంటే తక్కువగా ఉంది.