America's Ambassador : మాతో బంధాన్ని తేలికగా తీసుకోవద్దు!
ABN , Publish Date - Jul 13 , 2024 | 05:14 AM
అగ్రరాజ్యం అమెరికాతో ఉన్న బంధాన్ని తేలికగా భావించొద్దని, తేలికగా కూడా తీసుకోవద్దని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా హెచ్చరికలు చేశారు.
భారత్‌లో అమెరికా రాయబారి వ్యాఖ్యలు
పుతిన్-మోదీ భేటీపై పరోక్ష ఆందోళన
న్యూఢిల్లీ, జూలై 12: అగ్రరాజ్యం అమెరికాతో ఉన్న బంధాన్ని తేలికగా భావించొద్దని, తేలికగా కూడా తీసుకోవద్దని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా హెచ్చరికలు చేశారు. ఇటీవల రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
అప్పట్లోనే అమెరికా ఈ భేటీపై ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా భారత్‌లోని అమెరికా రాయబారి మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ‘‘మాతో బంధాన్ని తేలికగా తీసుకోవద్దని సూచిస్తున్నాం.
కొన్ని సంక్లిష్ట సమయాల్లో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కూడా ఉండదు’’ అని ఎరిక్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇరు దేశాల బంధం శక్తిమంతమైందని, ఎవరూ ఎవరికీ నచ్చజెప్పే పరిస్థితి ఉండదన్నారు. ముఖ్యంగా యుద్ధాలకు వ్యతిరేకంగా ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయని గుర్తుచేశారు.
ఐరాస తీర్మానానికి భారత్ దూరం
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి(ఐరాస) జనరల్ అసెంబ్లీ ప్రవేశ పెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. ‘ఉక్రెయిన్ అణు కేంద్రాల రక్షణ, భద్రత’ పేరుతో రూపొందించిన ఈ తీర్మానాన్ని ఉక్రెయిన్ సభ్యులు జనరల్ అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టారు. దీనికి అనుకూలంగా 193 మంది సభ్యులు ఉన్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 99 మంది అనుకూలంగా, 9 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 60 దేశాలు ఈ తీర్మానానికి దూరంగా ఉన్నాయి. వీటిలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, నేపాల్, దక్షిణాఫ్రికా, శ్రీలంక వంటివి ఉన్నాయి.