Ayodhya Visits: అయోధ్య పర్యటనలను వాయిదా వేసుకోండి.. మంత్రులకు సూచించిన మోదీ
ABN , Publish Date - Jan 24 , 2024 | 07:51 PM
అయోధ్యలో బాలక్ రామ్ దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తుండటంతో ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు తగిన సూచనలు ఇచ్చారు. రామాలయం పర్యటనలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని కోరారు.
న్యూఢిల్లీ: అయోధ్య (Ayodhya)లో బాలక్ రామ్ (Balak Ram) దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తుండటంతో ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన మంత్రివర్గ సహచరులకు తగిన సూచనలు ఇచ్చారు. రామాలయం పర్యటనలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని కోరారు. మోదీ అధ్యక్షతన బుధవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ మేరకు సలహా ఇచ్చారు.
అయోధ్య రామాలయం వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో వీవీఐపీలు, వీఐపీల పర్యటన వల్ల భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయని మోదీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. మంత్రులు తమ పర్యటనలను మార్చికి వాయిదా వేసుకోవాలని, అప్పుడైతే సజావుగా రామయ్యను దర్శించుకోవచ్చని, చక్కటి దర్శనానుభూతిని పొందవచ్చని ప్రధాని సూచించారు.
కాగా, అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ అనంతరం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలు కడుతున్నారు. వీరి రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం వేళలు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఇంతవరకూ రాత్రి 7 గంటల వరకూ ఉన్న దర్శన వేళలను 10 గంటల వరకూ పొడిగించారు. 29వ తేదీ వరకూ ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపేశారు.