Share News

నేడే కేజ్రీవాల్‌ రాజీనామా!

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:28 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనాను కలవనున్నారు.

నేడే కేజ్రీవాల్‌ రాజీనామా!

  • ఢిల్లీ ఎల్జీతో సాయంత్రం 4.30కి భేటీ.. కొత్త సీఎంగా అతీషికే అవకాశాలు అధికం

  • కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతుంది: ఆప్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనాను కలవనున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ అపాయింట్‌మెంట్‌ కోరగా.. ఎల్జీ సాయంత్రం 4.30 గంటలకు సమయం ఇచ్చారు. ఎల్జీతో భేటీలో కేజ్రీవాల్‌ రాజీనామా సమర్పించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అంతకుముందే, ఉదయం ఆప్‌ ఎమ్మెల్యేల భేటీ కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో జరగనుంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై దీంట్లో చర్చించనున్నట్లు ఆప్‌ వెల్లడించింది. తద్వారా, కేజ్రీవాల్‌ ఎల్జీని కలవటానికి ముందే కొత్త సీఎంపై స్పష్టత రానుంది.

ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ, బంతి బీజేపీ కోర్టులో ఉందని, కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే ధైర్యం ఉంటే ముందస్తు ఎన్నికలకు వాళ్లు సిద్ధమవుతారని అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, సీఎం పదవి నుంచి రెండు రోజుల్లో వైదొలగనున్నట్లు కేజ్రీవాల్‌ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తనతోపాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా మీద అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. తాము పదవులకు రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్తామని, ‘మీరు అవినీతి పరులు కాదు.. సచ్ఛీలురు’ అని వారు సర్టిఫికేట్‌ ఇచ్చిన తర్వాతే మళ్లీ తాము పదవులను చేపడతామని కేజ్రీవాల్‌ ప్రకటించారు. గడువు ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది.

అయితే, ఈ ఏడాది నవంబరులోనే మహారాష్ట్ర ఎన్నికలతో కలిపి జరపాల్సిందిగా కేజ్రీవాల్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కాగా, ఢిల్లీ కొత్త సీఎం ఎవరవుతారనేదానిపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అగ్రస్థానంలో ఢిల్లీ విద్య, ప్రజాపనుల శాఖల మంత్రి ఆతిషి ఉన్నారు. సిసోడియా అరెస్టు తర్వాత విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ఆతిషి ఢిల్లీలో స్కూళ్లను మెరుగుపరిచి వాటిలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పటానికి విశేష కృషి చేశారు. కేజ్రీవాల్‌, సిసోడియా జైలుకు వెళ్లటంతో.. మీడియా ఎదుట పార్టీ విధానాలను, నిర్ణయాలను వివరించే బాధ్యతలు తీసుకున్నారు. ప్రతిపక్ష బీజేపీ విమర్శలను గట్టిగా ఎదుర్కొన్నారు. ఆతిషి తర్వాత.. మరో మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌, ఎంపీలు రాఘవ్‌ చద్దా, సంజయ్‌సింగ్‌, ఆప్‌ సీనియర్‌ నేత కైలాశ్‌ గెహ్లాట్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

Updated Date - Sep 17 , 2024 | 03:28 AM