Share News

Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:33 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా పావులు కదిపారు. ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారంనాడు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం శనివారంనాడు సభలో చర్చకు చేపట్టనున్నారు.

Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అనూహ్యంగా పావులు కదిపారు. ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారంనాడు విశ్వాస తీర్మానాన్ని (Motion of Confidence) ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం శనివారంనాడు సభలో చర్చకు చేపట్టనున్నారు.


అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ, తప్పుడు కేసులు బనాయించడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో పార్టీలను చీలుస్తూ, ప్రభుత్వాలను కుప్పకూల్చడం అంతా చూస్తు్న్నామని అన్నారు. ఢిల్లీలోనూ మద్యం పాలసీ కేసు పేరుతో ఆప్ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారని, ఢిల్లీ ఎన్నికల్లో ఎప్పటికీ గెలవలేమనే విషయం వారికి తెలుసునందునే ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలు అందరూ చెక్కుచెదరకుండా పార్టీతోనే ఉన్నారనే విషయాన్ని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.


ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ గత బుధవారంనాడు ఆరోసారి సమన్లు పంపింది. ప్రతిసారి సీఎం విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కక్ష సాధింపు చర్యగా ఆప్ పేర్కొంటోంది. కాగా, ఈనెల 15న ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, 21వ తేదీతో ముగియనున్నాయి.

Updated Date - Feb 16 , 2024 | 05:33 PM