Delhi CM: ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్
ABN , Publish Date - Sep 17 , 2024 | 05:58 PM
ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఎంగా కొనసాగాలని ఎల్జీ కోరడంతో అంగీకరించారు.
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాజీనామా చేశారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభాపక్ష నేతగా అతిశీని ఎంపిక చేశామని ఎల్జీకి వివరించారు. వారం రోజుల్లో అతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ రోజు సీఎం పదవికి రిజైన్ చేశారు.
వారంలో సీఎంగా ప్రమాణం
వారం రోజుల్లో అతిశీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో అతిశీ సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిసింది. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను ఆమ్ ఆద్మీ పార్టీ భగ్నం చేసింది అని ఆప్ నేత గోపాల్ రాయ్ స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ ప్రతీన
లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవల బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఇదివరకు ఈడీ బెయిల్ ఇవ్వగా.. ఇటీవల సీబీఐ కేసులో బెయిల్ లభించింది. ఢిల్లీ ప్రజలు నిజాయితీ పరుడినని సర్టిఫికెట్ ఇచ్చే వరకు సీఎం పదవి చేపట్టబోనని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆ మేరకు సీఎం పదవికి రాజీనామా చేశారు.