Kejriwal: జైల్లో కేజ్రీవాల్ కోరిన మూడు పుస్తకాలు ఇవే..
ABN , Publish Date - Apr 01 , 2024 | 08:38 PM
తీహార్ జైలులో చదువుకునేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీతతో పాటు 'హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్' పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise policy)కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడిషియల్ కస్టడీ 15 రోజులు పొడిగించడంతో ఆయనను సోమవారంనాడు తీహార్ జైలుకు తరలించారు. జైలులోని జైల్ నెంబర్-2లో ఆయన ఒక్కరినే ఉంచనున్నారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు తన న్యాయవాది ద్వారా పలు అభ్యర్థనలు చేశారు. చదువుకునేందుకు జైలులో మూడు పుస్తకాలు కావాలని కోరారు. రామాయణం, భగవద్గీతతో పాటు 'హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్' పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని కోర్టుకు విన్నవించారు. తన ఆరోగ్య రీత్యా మందులు, డైట్ ప్రకారం ఆహారం ఇవ్వాలని, తన మెడలో ఉన్న లాకెట్‌ను అనుమతించాలని కూడా కోరారు.
కాగా, కేజ్రీవాల్ భద్రత కోసం ఆయన సెల్ వద్ద సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. ఆయనకు జైలు గదిలో టీవీ చూసే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. వార్తలు, వినోదం, క్రీడలు సహా 18 నుంచి 20 ఛానెల్స్ చూసే అవకాశం ఉంది. 24 గంటలూ మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంచారు. డయాబెటిక్ పేషెంట్ కావడంతో కేజ్రీవాల్‌కు జైలులో రెగ్యులర్‌గా మెడికల్ చెకప్‌లు ఉంటాయి. కుటుంబ సభ్యులను వారంలో రెండుసార్లు కలుసుకునే వీలు కల్పించారు. కుటుంబ సభ్యుల జాబితాను నిర్ధారించుకున్న తర్వాతే జైలు భద్రతా సిబ్బంది వారికి అనుమతి ఇస్తారు.