Haryana Assembly Elections: మోదీకి నా భర్త ఎప్పటికీ తలవంచరు: సునీత కేజ్రీవాల్
ABN , Publish Date - Sep 07 , 2024 | 04:58 PM
బీజేపీ కేవలం అధికారదాహంతో ప్రత్యర్థులను జైలులోకి నెడుతోందని, పార్టీలను చీల్చడం ఎలాగో వారికి బాగా తెలుసునని సునీత కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
భివాని: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ముందు అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ (Sunita Kejriwal) అన్నారు. బీజేపీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోంది విమర్శించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Elections) ప్రచారంలో భాగంగా భివానీలోని టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సునితా కేజ్రీవాల్ శనివారంనాడు పాల్గొని ప్రసంగించారు. హర్యానా కోడలుగా తనను తాను అభివర్ణించుకున్నారు. బీజేపీ కేవలం అధికారదాహంతో ప్రత్యర్థులను జైలులోకి నెడుతోందని, పార్టీలను చీల్చడం ఎలాగో వారికి బాగా తెలుసునని విమర్శలు గుప్పించారు.
''మీ ఇంటికి 24 గంటలూ విద్యుత్ అందుతోందా? ఉచితంగానే లభిస్తోందా? అలాంటిదేమీ లేదు. ప్రతి ఏరియాలోనూ విద్యుత్, గ్యాస్, నీటి కొరత కనిపిస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం చేసిన కృషి వల్లే అక్కడ నిరంతరాయ, ఉచిత విద్యుత్ సాధ్యమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆప్ అధికారంలో ఉంది. అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారు. పిల్లలకు చక్కటి భవిష్యత్ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు చక్కగా పనిచేస్తున్నాయి. చక్కటి చికిత్స అందుతోంది. మెహల్లా క్లినిక్‌లతో ఇచిత వైద్యం అందుతోంది. హిళలకు బస్సు ప్రయాణం ఉచితం. వృద్ధులకు తీర్ధయాత్రా పర్యటనకు ఏర్పాట్లు చేశాం. ప్రతి మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చే ఆలోచన కూడా ఉంది. ఇందువల్ల ప్రతి ఇంటికీ 3 నుంచి 4 వేల రూపాయలు ఆదా అవుతున్నాయి. ఇవన్నీ ఢిల్లీ, పంజాబ్‌లో చేసి చూపించాం'' అని సునీత తెలిపారు.
Ganesh Chaturthi: ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు
కేజ్రీవాల్ చేసిన పనుల వల్లే హర్యానా పేరు ప్రపంచమంతా చెప్పుకుంటున్నారని గుర్తుచేశారు. హర్యానా బాలుడు ఢిల్లీ సీఎం అవుతాడని ఎవరూ ఊహించలేదన్నారు. కృష్ణ జన్మాష్టమి రోజున కేజ్రీవాల్ పుట్టారని, ప్రత్యేక పనికి భగవంతుడు ఆయనను ఉద్దేశించాడని చెప్పారు. కానీ, హర్యానాలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండి ఏమి చేసిందని సునీత నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలు కానీ, పిల్లల విద్య కానీ మెరుగైందా అని సునీత ప్రశ్నించారు. కనీసం మంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయా? మందులు, చికిత్స ఉచితంగా అందుతోందా? అని ప్రశ్నించారు. అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా బీజేపీకి వెళ్లకూడదని, ప్రతి ఒక్కరూ ఆప్‌కు ఓటు వేసి కేజ్రీవాల్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..