Delhi: విద్వేష ప్రసంగాలు మానండి
ABN , Publish Date - May 03 , 2024 | 04:02 AM
విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం కన్నా గత పదేళ్లలో మీరు చేసిందేమిటో ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి’ అంటూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
పదేళ్లలో చేసిందేమిటో చెప్పండి
ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ
న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం కన్నా గత పదేళ్లలో మీరు చేసిందేమిటో ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి’ అంటూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్వయంగా చెబుతున్న అబద్ధాలతో అనుకున్న ప్రయోజనాలు నెరవేరడం లేదని మోదీ గుర్తించారని, అందుకనే ఆ అబద్ధాలను బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారం చేయాలని కోరుకుంటున్నారని విమర్శించారు.
అయితే, ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు చెప్పడం వల్ల అది నిజం కాబోదన్నారు. మోదీ తీవ్రమైన నిస్పృహతో, ఆందోళనతో ఉన్నట్లుగా ఆయన మాటలే తెలియజేస్తున్నాయని, ప్రధాని పదవి హోదాకు సరిపోని భాషను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని మోదీ ఎన్‌డీఏ ఎంపీ అభ్యర్థులకు బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో.. ఆ లేఖలోని అంశాలపై స్పందిస్తూ మోదీని ఉద్దేశించి ఖర్గే గురువారం లేఖ రాశారు
బీజేపీ చార్‌సౌ పార్ ఓ జోక్: థరూర్
బీజేపీ చెబుతున్న ‘చార్‌సౌ పార్’ అనేది ఓ జోక్ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ అభిప్రాయపడ్డారు. బీజేపీకి 300కు మించి సీట్లు రావడం అసాధ్యమని, 200 మార్కును దాటడం సవాలేనన్నారు. గురువారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాదిన కమల వికాసం ఉండబోదన్నారు. కేరళ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని, తెలంగాణలో సిటింగ్ స్థానాలను కాపాడుకోవడం కూడా కష్టమేనని చెప్పారు.