Share News

Bengal Train Accident: ‘కాంచన్ జంఘా’పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:27 PM

పశ్చిమ బెంగాల్‌లో కంచన్ జంఘా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ రైలు ప్రమాదంలో చాలా మంది మరణించారనే వార్త తనను కలచి వేసిందన్నారు.

Bengal Train Accident: ‘కాంచన్ జంఘా’పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ
Congress MP Rahul Gandhi

న్యూఢిల్లీ, జూన్ 17: పశ్చిమ బెంగాల్‌లో కంచన్ జంఘా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం స్పందించారు. ఈ రైలు ప్రమాదంలో చాలా మంది మరణించారనే వార్త తనను కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రైలు ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాహుల్ పిలుపు నిచ్చారు.


గత పదేళ్లలో రైల్వే ప్రమాదాలు పెరగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని ఆరోపించారు. ప్రతి రోజు ప్రయాణికులు ప్రాణాలతోపాటు ఆస్తి నష్టం కూడా జరుగుతుందన్నారు. అందుకు ఈ ప్రమాదం.. ఈ వాస్తవికతకు మరో ఉదాహరణ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అలాగే ఈ ప్రమాదాలకు మోదీ ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సిల్దాకు కాంచన్ జంఘా ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. ఆ క్రమంలో న్యూజల్పాయిగూరి వద్ద ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. అదే సమయంలో అదే ట్రాక్ పైకి గూడ్స్ రైలు వచ్చి.. వేగంగా కంచన్ జంఘా ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా.. 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు ఈ రైలు ప్రమాదంపై మోదీ ప్రభుత్వం స్సందించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - Jun 17 , 2024 | 03:37 PM