Share News

Viral News: అక్బర్, సీత పేర్లు మారాయ్.. కొత్త పేర్లేంటంటే

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:45 PM

పేరులో ఏముంది అని చాలా మంది అనుకుంటారు. కొన్నిసార్లు ఆ పేరే వివాదాలకు కారణమవుతుంది. ఇలాంటి ఘటనే గత కొంతకాలంగా కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం శిలిగుడి సఫారీ పార్క్‌లో ఉన్న రెండు సింహాల గురించే ఇదంతా.

Viral News: అక్బర్, సీత పేర్లు మారాయ్.. కొత్త పేర్లేంటంటే

ఇంటర్నెట్ డెస్క్: పేరులో ఏముంది అని చాలా మంది అనుకుంటారు. కొన్నిసార్లు ఆ పేరే వివాదాలకు కారణమవుతుంది. ఇలాంటి ఘటనే గత కొంతకాలంగా కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం శిలిగుడి సఫారీ పార్క్‌లో ఉన్న రెండు సింహాల గురించే ఇదంతా. ఆ సింహాలకు అక్బర్, సీత పేరు పెట్టడం వాటిని ఒకే జూలో వేయడం మతపరమైన వివాదానికి దారి తీసింది. అయితే తాజాగా ఆ సింహాల పేర్లను మార్చారు.

వివాదం ఏంటంటే..

పశ్చిమ బెంగాల్‌ అటవీ శాఖ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ హిందు ధార్మిక సంస్థ వీహెచ్‌పీ ఈ ఏడాది ఫిబ్రవరిలో కలకత్తా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 12న త్రిపురలోని సిపాహీజలా జులాజికల్‌ పార్కు నుంచి రెండు సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకి ఒక మగ సింహం, ఒక ఆడ సింహాన్ని అధికారులు తీసుకువచ్చారని వీహెచ్‌పీ తెలిపింది.


అయితే అందులో ఆడ సింహానికి సీత అని, మగ సింహానికి అక్బర్ అని పేరు పెట్టారని ఆరోపించింది. పైగా ఆ రెండు సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో అధికారులు ఉంచారని కోర్టుకు తెలిపింది. ఇది హిందువుల మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడమేనని వీహెచ్‌పీ భావించింది. ఈ పిటిషన్‌లో పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు, బెంగాల్‌ సఫారీ పార్క్‌ డైరెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చింది.

అలా కొన్నాళ్లుగా ఈ కేసుపై వాదోపవాదాలు నడుస్తూ వస్తున్నాయి. బెంగాల్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులే ఆ సింహాలకు ఆ పేర్లు పెట్టారని వీహెచ్‌పీ ఆరోపించింది. జంతువుకు సీత పేరు పెట్టడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొంది. వెంటనే సీత పేరు మార్చాలని సంస్థ డిమాండ్ చేసింది. కోర్టు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేర్లు మార్చాలని దీదీ సర్కార్‌ను ఆదేశించింది.


కొత్త పేర్లివే..

అయితే అక్బర్, సీత సింహాల పేర్లను సూరజ్‌, తాన్యాగా మారుస్తున్నట్లు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సింహాల పేర్లు మార్చడంతో ఈ కేసు వివాదం ముగిసినట్లు అదనపు అడ్వకేట్‌ జ్యోతి చౌదరి పేర్కొన్నారు. త్రిపుర నుంచి బెంగాల్‌కు అప్పగించే సమయంలో సింహాలు ఈ పేర్లు కలిగిఉన్నాయని నిరూపితమయిందన్నారు.

సింహాల పేర్లు మారడంతో విశ్వహిందూపరిషత్‌ (VHP) హర్షం వ్యక్తం చేసింది. వీహెచ్‌పీ తరఫు న్యాయవాది సుదీప్తో మజుందార్ మాట్లాడుతూ.. “ఏ జంతువుకు ఏ దేవత పేరు పెట్టకూడదు. మేం ఇదే అంశాన్ని కోర్టులో లేవనెత్తాం. అలా ఎవరు చేసినా తప్పే. విచారణ సమయంలో పేరు మార్పును కోర్టు స్వయంగా సూచించింది. అది కార్యరూపం దాల్చింది" అని పేర్కొన్నారు.

For Latest News and National News Click Here

Updated Date - Aug 02 , 2024 | 03:45 PM