Share News

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:59 PM

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు. హనీమూన్ కోసం గోవాకు తీసుకెళ్తానని భర్త తనకు మాటిచ్చి, అయోధ్యకు తీసుకెళ్లడంతో ఆమె తీవ్ర కోపాద్రిక్తురాలైంది. ఎంతలా అంటే.. ఏకంగా విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టునే ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటు చేసుకుంది.


ఆ వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని పిప్లానీకి చెందిన ఈ జంటకు 2023 ఆగస్టులో వివాహం అయ్యింది. భర్త ఐటీ సెక్టార్‌లో ఉండటం, మంచి జీతం వస్తుండటంతో.. హనీమూన్‌కి విదేశాలకు వెళ్లాలని భార్య ఆశించింది. అయితే.. భర్త ఇండియాలోనే ఏదైనా ఒక హనీమూన్ స్పాట్‌కి వెళ్దామని చెప్పాడు. దీంతో.. ఇద్దరు మాట్లాడుకొని, చివరికి గోవాకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే.. ఆ వ్యక్తి తల్లి మాత్రం అయోధ్యతో పాటు బనారస్‌లను సందర్శించాలని భావించింది. ఇదే కోరికను తన కొడుకుతో పంచుకుంది. తల్లి కోరిక మేరకు.. భార్యకు చెప్పకుండా అతను అయోధ్య, వారణాసి టికెట్లను బుక్ చేశాడు. సరిగ్గా విహారయాత్రకు బయలుదేరడానికి ఒక రోజు ముందు.. తాము గోవాకు వెళ్లడం లేదని, అయోధ్యతో పాటు బనారస్‌కు వెళ్తున్నామని భార్యకు చెప్పాడు.

ఆ సమయంలో భార్య ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. భర్త, అత్తమామలతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. కానీ.. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఆమె ఊహించని షాక్ ఇచ్చింది. భర్త నుంచి విడాకులు కావాలని కోరుతూ.. కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎందుకని ప్రశ్నిస్తే.. తన కన్నా కుటుంబ సభ్యులకే భర్త ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని, వారినే బాగా చూసుకుంటున్నాడని ఆమె కోర్టులో పేర్కొంది. ఆమె చెప్పిన ఈ కారణం విని.. అందరూ అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు కౌన్సిలింగ్ జరుగుతోందని ఫ్యామిలీ కోర్టు లాయర్ ఒకరు తెలిపారు.

Updated Date - Jan 25 , 2024 | 04:59 PM