PM Modi: సుస్థిరతకే ఓటు.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఇదేనన్న మోదీ
ABN , Publish Date - Jun 21 , 2024 | 07:44 PM
'సుస్థిరత'కే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు పెద్దపీట వేశారని, సుస్థిరతను కోరుకుంటున్నామనే సందేశాన్ని ఎన్నికలు ఫలితాలు చాటిచెప్పాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడాన్ని ప్రస్తావిస్తూ, సుస్థిర ప్రభుత్వమనే కొత్త శకంలోకి దేశం అడుగుపెట్టిందన్నారు.
శ్రీనగర్: 'సుస్థిరత' (Stability)కే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు పెద్దపీట వేశారని, సుస్థిరతను కోరుకుంటున్నామనే సందేశాన్ని ఎన్నికలు ఫలితాలు చాటిచెప్పాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడాన్ని ప్రస్తావిస్తూ, సుస్థిర ప్రభుత్వమనే కొత్త శకంలోకి దేశం అడుగుపెట్టిందన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ఫలితాలు చూపెట్టిందని, పనితీరు ఆధారంగానే ప్రజలు 60 ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు.
తమకంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ, గత శతాబ్దంలోని చివరి దశాబ్దంలో అస్థిర ప్రభుత్వాలను చూశామనీ, పదేళ్లలో ఐదుసార్లు ఎన్నికలు జరిగాయని అన్నారు. ఎన్నికలకే దేశం పరిమితమైందే కానీ ఎలాంటి ప్రగతి సాధించలేకపోయిందన్నారు. ఇలాంటి అస్థిరత, అనిశ్చితి సమయంలో ఇండియాను ముందుకు తీసుకువెళ్తేందుకు తాము పగ్గాలు చేపట్టామని, పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని చెప్పారు. ఇదంతా గతమని, ఇప్పుడు ఇండియా సుస్థిర ప్రభుత్వ శకంలోకి అడుగుపెట్టిందని, ప్రజాస్వామ్యం మరింత పటిష్టమైందని అన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతలో జమ్మూకశ్మీర్ పాత్ర కీలకమని చెప్పారు. మానవత్వం, ప్రజాస్వా్మ్యం, కశ్మీరియత్ కోసం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నకలలు సాకారం కానున్నాయని అన్నారు.
Narendra Modi: యోగా డేలో పాల్గొన్న ప్రధాని మోదీ.. 7 వేల మందితో చేయాల్సి ఉండగా..
త్వరలోనే జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం
జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే తిరిగి రాష్ట్ర హోదా కలిగించున్నామనే సంకేతాలిస్తూ, అసెంబ్లీ ఎన్నికల ద్వారా కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయం ఎంతో దూరంలో లేదని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఎన్నికలతో జమ్మూకశ్మీర్ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం, తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలు సైతం జరుగుతున్నాయని చెప్పారు. రూ.1,500 కోట్ల విలువచేసే 84 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులను గురువారం ప్రారంభించనున్నట్టు కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.1,800 కోట్లతో వ్యవసాయరంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రారంభించనున్నామని, కొత్త జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించనున్నామని చెప్పారు. గత పదేళ్లలో కశ్మీర్ స్టార్టప్‌లు, స్కిల్ డవలప్‌మెంట్, క్రీడల్లో ముందుకు దూసుకెళ్లోందని, పాలిటెక్నిక్ సీట్లు పెరిగాయని, న్యూ స్కిల్స్‌కు అవకాశాలు పెరగాయని, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ నిర్మాణాలతో పాటు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా జరుగుతోందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి స్థాపనకు అవరోధం కలిగిచే టెర్రరిస్టులకు గుణపాఠం చెప్పేందుకు తమ ప్రభుత్వం ఎంతమాత్రం వెనుకాడదని స్పష్టం చేశారు.