Instagram Reels: దారుణం.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయొద్దన్న పాపానికి భర్త హతం
ABN , Publish Date - Jan 08 , 2024 | 08:54 PM
సోషల్ మీడియా మోజులో పడి చాలామంది తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదు. నెట్టింట్లో వచ్చే లైక్స్, కామెంట్ల కోసం.. అయిన వాళ్లతో గొడవలు పడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కొందరైతే చంపడానికి కూడా...
Instagram Reels: సోషల్ మీడియా మోజులో పడి చాలామంది తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదు. నెట్టింట్లో వచ్చే లైక్స్, కామెంట్ల కోసం.. అయిన వాళ్లతో గొడవలు పడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కొందరైతే చంపడానికి కూడా వెనుకావడం లేదు. తాజాగా ఒక మహిళ కూడా ఇలాంటి దారుణానికే పాల్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయొద్దని చెప్పిన పాపానికి.. కుటుంబ సభ్యులతో కలిసి ఓ మహిళ తన భర్తని అతి కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన బిహార్‌లోని బెగుసరైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బెగుసరైలోని ఫపౌట్ గ్రామానికి చెందిన మహేశ్వర్ కుమార్ రాయ్‌కు ఆరేళ్ల క్రితం రాణి కుమారితో వివాహం అయ్యింది. ఈ జంటకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ పోషణ కోసం 25 ఏళ్ల మహేశ్వర్ కోల్‌కత్తాలో కూలీగా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. దీంతో.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రాణి కుమారి, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. రానురాను అది ఆమెకు వ్యసనంగా మారింది. తనకు 9,500కు పైగా ఫాలోవర్లు రావడంతో.. పాపులర్ అవుతున్నానన్న ఉద్దేశంతో రీల్స్ చేయడం మరింత పెంచేసింది. కట్ చేస్తే.. కోల్‌కత్తా నుంచి మహేశ్వర్ ఇటీవల తిరిగి గ్రామానికి వచ్చాడు. అయితే.. రాణి తన భర్తని పట్టించుకోవడం మానేసి, రీల్స్ చేయడం మీదే ఎక్కువ దృష్టి సారించింది. దీంతో కోపాద్రిక్తుడైన మహేశ్వర్.. రీల్స్ చేయడం ఆపేయాలని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇలా భార్యాభర్తల మొదలైన ఈ వివాదం.. చినికి చినికి గాలివానగా మారడంతో, రాణి కుమారి తన పుట్టింటికి వెళ్లింది. తన భార్యని ఇంటికి తీసుకురావడం కోసం, మహేశ్వర్ అత్తారింటికి వెళ్లాడు. అక్కడ కూడా వీరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే.. రాణి, ఆమె కుటుంబసభ్యులు మహేశ్వర్‌ని చంపేశారు. మరోవైపు.. మృతుడి సోదరుడు రుదాల్ ఫోన్ చేయగా, మరొకరు ఫోన్ లిఫ్ట్ చేశారు. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి, రుదాల్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో.. తన సోదరుడికి ఏదో అయ్యిందన్న విషయం గ్రహించి, రుదాల్ తన కుటుంబ సభ్యుల్ని తీసుకొని మహేశ్వర్ అత్తారింటికి వెళ్లాడు. అక్కడ వాళ్లకు మహేశ్వర్ మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రాణి కుమారిని, ఆమె కుటుంబ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.