Lawrence Bishnoi: ఎవరీ బిష్ణోయ్.. నెక్ట్స్ టార్గెట్ ఆ ప్రముఖుడేనా..!
ABN , Publish Date - Oct 15 , 2024 | 04:04 AM
వయసు 30 మాత్రమే.. కానీ, అంతే సంఖ్యలో కేసులు..! హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, ఆయుధాల రవాణా కిడ్నా్‌పలు.. ఒకటేమిటి అనేక నేరాలు..!
700 మంది షూటర్లు.. 5 రాష్ట్రాల్లో హల్‌చల్
కెనడా సహా పలు దేశాల్లోనూ కార్యకలాపాలు!
మూసేవాలా హత్యతో ఉత్తరాదిన సంచలనం
సబర్మతి జైల్లో లారెన్స్.. అక్కడినుంచే హవా
న్యూఢిల్లీ, ముంబై, అక్టోబరు 14: వయసు 30 మాత్రమే.. కానీ, అంతే సంఖ్యలో కేసులు..! హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, ఆయుధాల రవాణా కిడ్నా్‌పలు.. ఒకటేమిటి అనేక నేరాలు..! ఎప్పుడంటే అప్పుడు స్పందించేలా 700 మంది షూటర్లతో గ్యాంగ్.. జైలు నుంచే కార్యకలాపాలు..! ఇప్పుడు అతడి పేరు చెబితే ఉత్తరాదిలోని ఐదు రాష్ట్రాల్లో వణుకు..! ఇదీ లారెన్స్ బిష్ణోయ్ నేర సామ్రాజ్యం. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై గురిపెట్టి.. పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా.. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో మరింతగా చర్చనీయాంశమయ్యాడు. ఇంతకూ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్ అంటే..?
కానిస్టేబుల్ కుమారుడు..
లారెన్స్ బిష్ణోయ్ 1993లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా ధత్తరన్‌వాలిలో పుట్టాడు. ఇతడి తండ్రి హరియాణా పోలీస్ కానిస్టేబుల్. కృష్ణ జింకలను అమితంగా ఆరాధించే బిష్ణోయ్ వర్గానికి చెందిన లారెన్స్ చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి నాయకుడు. ఇదే కమ్రంలో గోల్డీ బ్రార్ పరిచయమై నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. కాలేజీ గ్యాంగ్ వార్‌లో తన స్నేహితురాలిని సజీవ దహనం చేయడం.. లారెన్స్‌లో తీవ్ర కసిని పెంచింది. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను చంపిన కేసులో నిందితుడైన సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక వేయడం ద్వారా లారెన్స్ వార్తల్లోకెక్కాడు. ఇతడి గ్యాంగ్ కార్యకలాపాలు పంజాబ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లకు విస్తరించాయి.
ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న లారెన్స్.. ఇతర ఖైదీల ద్వారా సెల్‌ఫోన్లు సంపాదిస్తూ తమ గ్యాంగ్‌కు ఆదేశాలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సమాజంలో పేరున్న, డబ్బున్నవారిని, పంజాబీ గాయకులు, మద్యం వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లు కెనడాలో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. లారెన్స్‌ను హత్య చేసేందుకు ఢిల్లీ మాఫియా తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో అతడిని కోర్టులకు గట్టి భద్రత మధ్య తరలించాల్సి వస్తోంది. కాగా, బాబా సిద్దిఖీనే కాక ఆయన కుమారుడు జీషన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాబా హత్య కేసులో పట్టుబడిన నిందితులు ఈ విషయం వెల్లడించారన్నారు.