TS Politics: కారు దిగిన నేతలకే టికెట్లు
ABN , Publish Date - Mar 13 , 2024 | 04:16 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో గణనీయమైన స్థానాలను సాధించి బలం పెంచుకున్న బీజేపీ.. పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.
కమలం ఎంపీ బీ ఫారాల్లో వారికే అగ్రస్థానం
2 టికెట్ల ఖరారు.. 4 టికెట్లపై త్వరలో ప్రకటన
మరో 2 స్థానాలపై బీఆర్‌ఎస్ నేతలతో చర్చలు
గులాబీ పార్టీని వెనక్కి నెట్టడమే బీజేపీ లక్ష్యం!
న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో గణనీయమైన స్థానాలను సాధించి బలం పెంచుకున్న బీజేపీ.. పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని మరింత బలపడాలని వ్యూహం రచిస్తోంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా తమ ఓటు బ్యాంకును మరింత పెంచుకుని రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సను వెనక్కి నెట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో కాషాయ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కమల దళంలోకి వలస వచ్చే నేతలకు అగ్ర తాంబూలం ఇస్తూ.. రాష్ట్రంలో పాగా వేసేందుకు సన్నద్ధమవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలకు టికెట్‌పై స్పష్టమైన హామీ ఇవ్వని కమలనాథులు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వారే స్వయంగా ఇతర పార్టీల నేతల దగ్గరికి వెళ్లి మంతనాలు జరుపుతున్నారు. పార్టీలో చేరితే టికెట్ పక్కా అంటూ హామీ ఇస్తున్నారు. బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తులో గడ్డు కాలమేనని వివరిస్తూ.. తామే ప్రధాన ప్రత్యర్థి అని నమ్మకం కలిగిస్తూ నేతల చేరికలను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో రాష్ట్రంలోని తొమ్మిది సీట్లకు పోటీ చేయబోయే వారి పేర్లను ప్రకటించింది. అందులో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్‌కు పార్టీలో చేరిన వెంటనే టికెట్లను ఖరారు చేసింది. దీంతో ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకుని, ఇప్పటికే అక్కడ పనిచేసుకుంటున్న కమల నాథులు పార్టీ వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారు.
రెండో జాబితాలోనూ వారిదే హవా..
బీజేపీ నేడో రేపో విడుదల చేసే రెండో జాబితాలో రాష్ట్రంలోని మిగిలిన సీట్లకూ అభ్యర్థులను ప్రకటించనుంది. మొత్తం 17 స్థానాల్లో మిగిలిన మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, పెద్దపల్లి, మెదక్ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ సీట్లలో అభ్యర్థిత్వం గురించి వినిపించే పేర్లలో ఏ ఒక్కరూ కూడా ఏళ్లకుఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నవారు లేకపోవడం గమనార్హం. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నుంచి నగేశ్, నల్లగొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నలుగురూ నాలుగు రోజుల క్రితం బీఆర్‌ఎస్ నుంచి కమలం పార్టీలో చేరారు. వరంగల్ టికెట్ బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, పెద్దపల్లి టికెట్‌ను బీఆర్‌ఎ్‌సతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న మిట్టపల్లి సురేందర్‌కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మెదక్ సీటుకు రఘునందన్‌రావు.. మహబూబ్‌నగర్ స్థానం కోసం డీకే అరుణ, జితేందర్‌రెడ్డి పోటీపడుతుండగా.. వీరెవరూ బీజేపీలో కింది స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చిన వారు కాదు.
వలస నేతలకు టికెట్లపై అసంతృప్తి..
క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే కాషాయ పార్టీలో వలస నేతలకు టికెట్లు కేటాయించడంపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. మల్కాజ్‌గిరి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మురళీధర్‌రావు తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తికి హైదరాబాద్ టికెట్ ఇవ్వడమేంటని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
నిజామాబాద్ టికెట్ దక్కిన ధర్మపురి అర్వింద్‌పై స్థానిక నేతలు ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎన్నడూ లేనివిధంగా పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా అసంతృప్త జ్వాలలు చెలరేగడం కమల దళంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెండో జాబితా ప్రకటించిన తర్వాత పార్టీలో అసమ్మతి సెగలు మరింత ఎక్కువగా ఉంటాయనే చర్చ జరుగుతోంది.