Arvind Kejriwal: పదేళ్లలో 2 రాష్ట్రాల్లో అధికారం, అందుకే బీజేపీకి భయం..
ABN , Publish Date - Feb 11 , 2024 | 06:14 PM
పదేళ్లలో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని, ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నామని, బీజేపీ భయపడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఛండీగఢ్: పదేళ్లలో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని, ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నామని, బీజేపీ భయపడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాత్రమేనని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. పంజాబ్‌లో ఆదివారంనాడు జరిగిన జనసభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
''ఆప్ చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పూర్తయితే ఆప్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరనే భయం బీజేపీకి పట్టుకుంది. ఢిల్లీ ప్రజలు ఆప్‌కు 7 లోక్‌సభ స్థానాలు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ప్రజలు సైతం 13 లోక్‌సభ స్థానాలు ఆప్‌కు ఇస్తే ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరుస్తాం. బీజేపీ ఒక్క ఆప్‌కు మాత్రమే భయపడుతోంది'' అని కేజ్రీవాల్ అన్నారు.
దీనికి ముందు పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్‌లో ఆయన మాట్లాడుతూ, గత 75 ఏళ్లలో పంజాబ్‌లో అవినీతి ప్రభుత్వాలున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం గోవింద్వాల్ సాహిబ్ వద్ద 540 మెగావాట్ల ప్రైవేటు థర్మల్ పవర్ ప్లాంట్‌ను అతి తక్కువ రేటుకే అందుబాటులోకి తెచ్చిందన్నారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలకు ఈ పవర్ ప్లాంట్ ద్వారా తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ''ఘర్ ఘర్ ముఫ్త్ రేషన్''తో రాష్ట్రంలో రేషన్ మాఫియాకు ముకుతాడు వేశామన్నారు. పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాలు, ఛండీగఢ్‌లో ఒక స్థానానికి ఆప్ పోటీ చేస్తుందని, రాబోయే 10-15 రోజుల్లో ఈ 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.