Pucture Shop: డిగ్రీలతో వచ్చేదేం లేదు.. పంక్చర్ షాపులు పెట్టుకోండి
ABN , Publish Date - Jul 15 , 2024 | 07:41 PM
ఉద్యోగాల ప్రస్తావన వచ్చినప్పుడు.. దాదాపు రాజకీయ నేతలందరి స్వరం ఒకేలాగా ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఉద్యోగాలిస్తామని హామీ ఇస్తారు. అందుకోసం..
ఉద్యోగాల (Jobs) ప్రస్తావన వచ్చినప్పుడు.. దాదాపు రాజకీయ నేతలందరి స్వరం ఒకేలాగా ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఉద్యోగాలిస్తామని హామీ ఇస్తారు. అందుకోసం కష్టపడి బాగా చదువుకోవాలని సూచనలు కూడా ఇస్తారు. కానీ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ (BJP) ఎమ్మెల్యే మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడటం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. ఎన్ని చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు పొందినా.. వాటితో ఒరిగేదేమీ లేదని బాంబ్ పేల్చారు. కనీసం పంక్చర్ షాపులు పెట్టుకున్నా.. ఆర్థిక అవసరాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు.
ఆ బీజేపీ ఎమ్మెల్యే పేరు పన్నాలాల్ శాక్యా (Pannalal Shakya). ఇటీవల ఆయన తన గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో ‘పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్’ని (PM College Of Excellence) ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ప్రారంభిస్తున్నాము. అయితే.. నేను విద్యార్థులందరికీ ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ఈ కాలేజీ డిగ్రీలతో ఏమీ ఒరగదని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఆ డిగ్రీలకు బదులుగా.. జీవనోపాధి కోసం కనీసం మోటార్ సైకిల్ పంక్చర్ రిపేర్ షాపులైనా పెట్టుకోండి’’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. పెరుగుతున్న వాతావరణ కాలుష్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈరోజుల్లో ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంపై ఆసక్తి చూపుతున్నారు కానీ, వాటికి నీళ్లు మాత్రం పోయడం లేదని పన్నాలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మనం పంచతత్వాన్ని (భూమి, గాలి, నీరు, సౌరశక్తి, ఆకాశం) కాపాడటానికి ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పంచతత్వాన్ని కాపాడుకోవడంపై ఎవరూ దృష్టి సారించడం లేదన్నారు. అలాగే.. దుష్ప్రభావాల గురించి పట్టించుకోకుండా ప్రజలు ఏదిపడితే అది తింటున్నారన్నారు. అయితే.. పంక్చర్ షాపులు పెట్టుకోమ్మని ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం అవి అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read Latest National News and Telugu News