ఖర్గే కుటుంబ సభ్యులు ఏరో స్పేస్ పారిశ్రామికవేత్తలా?
ABN , Publish Date - Aug 27 , 2024 | 06:04 AM
డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్ సిరోయ మండిపడ్డారు. ఖర్గే కుటుంబానికి చెందిన సిద్దార్థ విహార ట్రస్టుకు కర్ణాటక
భూముల కేటాయింపుపై బీజేపీ ఎంపీ లెహర్‌సింగ్ ఆగ్రహం
నిబంధనల మేరకే కేటాయింపులు: మంత్రి ఎంబీ పాటిల్
బెంగళూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్ సిరోయ మండిపడ్డారు. ఖర్గే కుటుంబానికి చెందిన సిద్దార్థ విహార ట్రస్టుకు కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవల్‌పమెంట్ బోర్డు (కేఐఏడీబీ) భూమి మంజూరు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఐదు ఎకరాలను ఎస్సీ కోటాలో ఈ ట్రస్టుకు ఎలా కేటాయించారని ఆదివారం సోషల్ మీడియా ద్వారా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఖర్గే కుటుంబికులు ఏరోస్పేస్ రంగంలో ఎప్పుడు పారిశ్రామికవేత్తలు అయ్యారని ప్రశ్నించారు. బెంగళూరు సమీపంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో భూమి మంజూరు చేశారని అన్నారు. ట్రస్టులో మల్లికార్జున ఖర్గే, ఆయన భార్య రాధాబాయి, అల్లుడు రాధాకృష్ణ, కుమారుడు, రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే, మరో కుమారుడు రాహుల్ ఖర్గే సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అయితే.. భూముల కేటాయింపును రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ సమర్థించుకున్నారు. సిద్దార్థ విహార ట్రస్టుకు నిబంధనలకు అనుగుణంగానే స్థలం కేటాయించామని అన్నారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ పరిశోధనలు, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి కేటాయించామని తెలిపారు. రాహుల్ ఖర్గే ఐఐటీ చదివారని, వారి కుటుంబం విద్యారంగంలో ఉందన్నారు. పరిశోధనా కేంద్రాలకు అనుకూలంగా ఉండాలనే ఆ భూమిని కేటాయించామని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం చాణక్య యూనివర్సిటీకి పారిశ్రామికవాడలో కేవలం రూ.50 కోట్లకు 116 ఎకరాల భూమిని కేటాయించిందని, దీనిని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు.