BJP: అక్టోబరులో బీజేపీకి కొత్త నాయకత్వం
ABN , Publish Date - Aug 27 , 2024 | 04:17 AM
భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షుడి నియామకంపై కసరత్తు దాదాపు పూర్తయింది. కానీ, హరియాణా, జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే బీజేపీకొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
సంఘ్‌తో సన్నిహితుడికే అధ్యక్ష పదవి!
ఈ సారి రాంమాధవ్‌కు కీలక బాధ్యతలు?
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షుడి నియామకంపై కసరత్తు దాదాపు పూర్తయింది. కానీ, హరియాణా, జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే బీజేపీకొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సెప్టెంబరు 1 నుంచి 27 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అక్టోబరు మొదటివారంలో హరియాణా, కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నాయి. జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ అగ్రనేతల కసరత్తు దాదాపు పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే నూతన అధ్యక్షుడిని నియమిస్తారని తెలుస్తోంది.
పార్టీ అధ్యక్షుడిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్యను మోదీ, అమిత్ షా ప్రతిపాదించినప్పటికీ సంఘ్ నాయకత్వం తిరస్కరించినట్లు తెలిసింది. సంఘ్‌తో బలమైన సంబంధాలున్న నేతకే బీజేపీ అద్యక్ష పదవి కట్టబెట్టాలని, ఈ సారి ఉత్తరాది నుంచి కాకుండా దక్షిణాది వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆరెస్సెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే మధ్యేమార్గంగా మళ్లీ రాజ్‌నాథ్‌సింగ్ వంటి నేతకు అవకాశం ఇవ్వాలని, ఆయన మిత్రపక్షాలతో కూడా స్నేహ సంబంధాలు నెలకొల్పగలరని మోదీ, అమిత్ షా సూచించినట్లు తెలిసింది. కాగా, గత కొన్నేళ్లుగా బీజేపీకి దూరం పెట్టిన ఆరెస్సెస్ నేత రాంమాధవ్‌ను మళ్లీ జమ్మూకశ్మీర్ ఇన్‌చార్జిగా నియమించడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త టీంలో భాగంగా రాంమాధవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.