BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్‌పై కేసు రద్దుకు హైకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Feb 09 , 2024 | 11:59 AM
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కు చుక్కెదురైంది.
- కొనసాగించవచ్చని కిందికోర్టుకు సూచన
చెన్నై: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కు చుక్కెదురైంది. ఆయనపై దాఖలైన కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేగాక ఆయనపై వున్న కేసు విచారణ చట్టపరంగా కొనసాగించవచ్చని కూడా స్పష్టం చేసింది. 2022లో యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో... దీపావళి పండుగకు టపాసులు కాల్చరాదంటూ క్రైస్తవ మిషనరీలు తొలుత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయని అన్నామలై తెలిపారు. అన్నామలై వ్యాఖ్యలు ఇరు మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ సేలంకు చెందిన పర్వావరణ ప్రేమికుడు పీయూష్ మనుష్ సేలం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణకు స్వయంగా హాజరుకావాలని కోర్టు అన్నామలైకు సమన్లు జారీచేసింది. ఈ సమన్లు వ్యతిరేకిస్తూ, తనపై మోపిన కేసు రద్దు చేయాలని కోరుతూ అన్నామలై తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌లో... తన మాటలను వక్రీకరించారని అన్నామలై పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్, అన్నామలై పిటిషన్‌ను తోసిపుచ్చడంతో పాటు ఆయనపై నమోదైన కేసు రద్దు చేసేందుకు నిరాకరించారు. అలాగే, చట్టానికి అనుగుణంగా సేలం కోర్టు విచారణ చేపట్టవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.