BJP state president: అప్పుడు అదానీని దూషించినవారే.. ఇప్పుడు పొగుడుతున్నారు
ABN , Publish Date - Jan 10 , 2024 | 09:10 AM
రాష్ట్రంలో రాజకీయాలు పక్కన పెట్టిన కొన్ని పార్టీలు, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలని ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు తెలియజేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) అన్నారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో రాజకీయాలు పక్కన పెట్టిన కొన్ని పార్టీలు, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలని ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు తెలియజేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) అన్నారు. నగరంలో ఆది, సోమవారాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడులో దేశ, విదేశాలకు చెందిన సంస్థలు సుమారు రూ.6.64 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడుపై అన్నామలై మంగళవారం స్పందిస్తూ... గత ఎన్నికల సమయంలో డీఎంకే నేతలు అదానీ గ్రూపు గురించి పలు ఆరోపణలు చేశారన్నారు. అదాని మోదీ ఆస్తి అని, ఆయనకు బీజేపీతో సంబంధాలున్నాయని, పార్టీకి నిధులు అందిస్తున్నట్టు ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం అదే అదానీ సంస్థ రాష్ట్రంలో రూ.42,768 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో సీఎం తన ఎక్స్‌లో అభినందనలు తెలుపుతున్నారన్నారు. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రూ.33.51 లక్షల కోట్ల పెట్టుబడులు పొందిన నేపథ్యంలో, రాష్ట్రంలో మాత్రం రూ.6.64 లక్షల కోట్లు మాత్రమే సమీకరించం ఏంటి? అని అన్నామలై ప్రశ్నించారు.