Share News

BJP: బీజేపీకి నూతన రథ సారథి.. జాతీయ అధ్యక్షుడిగా ఎవరంటే?

ABN , Publish Date - Jul 19 , 2024 | 07:45 AM

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను నియమించవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మౌర్య యూపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన ఆయనకు అవకాశం కల్పించవచ్చని చర్చ జరుగుతోంది.

BJP: బీజేపీకి నూతన రథ సారథి.. జాతీయ అధ్యక్షుడిగా ఎవరంటే?

  • మోదీ, అమిత్‌ షాలకు అత్యంత సన్నిహిత నేత

  • యూపీలో పలు ఎంపీ సీట్లలో ఓటమికి యోగిని బాధ్యుడిని చేయాలని ఎత్తులు

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను నియమించవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మౌర్య యూపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన ఆయనకు అవకాశం కల్పించవచ్చని చర్చ జరుగుతోంది.

మౌర్య వెనుకబడిన వర్గాలకు చెందిన నేత కావడంతో బీసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడైన మౌర్యను 2017లోనే యూపీ ముఖ్యమంత్రిగా నియమించాలనుకున్నప్పటికీ.. యోగీ ఆదిత్యనాథ్‌ రంగంలోకి దిగడంతో అది సాధ్యం కాలేదు. మౌర్యకూ యోగికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు విభేదాలున్నాయని, యోగి ప్రతి కదలికనూ ఆయన ఢిల్లీకి చేరవేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


mourya.jpgకాగా, పార్టీ కంటే ఎవరూ గొప్పకాదని బుధవారం మౌర్య చేసిన ప్రకటన చర్చకు దారి తీసింది మంగళవారం మౌర్య ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షాలను కలిసి వెళ్లిన తర్వాత ఈ ప్రకటన చేయడంతో మౌర్య ద్వారా ఢిల్లీ నేతలు యోగికి సందేశాలు పంపినట్లు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గత లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ పలు సీట్లు కోల్పోవడంపై యోగిని జవాబుదారీ చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. అయితే, ఈ ఓటమితో తనకు సంబంధం లేదని, తనను సంప్రదించకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని యోగి అన్నట్లు సమాచారం. త్వరలో యూపీలో పది అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు యోగి భవిష్యత్తును నిర్ణయించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.


మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు 9 మంది ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎంపిక కావడం, ఒక సమాజ్‌వాదీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పది సీట్లలో గతంలో ఐదు సీట్లు ఎస్పీ గెలుచుకున్నవే. ఈ ఉప ఎన్నికలకు ముందే బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను నియమిస్తారా..? లేదా..? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే యోగి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మౌర్యనే జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా యోగిని ఇరకాటంలో పెట్టాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం.

For Latest News and National News click here

Updated Date - Jul 19 , 2024 | 07:45 AM