Share News

కేకుల్లో క్యాన్సర్‌ కారకాలు

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:11 AM

కేకులంటే మీకు ఇష్టమా? బ్లాక్‌ ఫారెస్ట్‌, రెడ్‌ వెల్వెట్‌ వంటి కంటికి ఇంపుగా కనిపించే కేక్స్‌ చూస్తే తినకుండా ఉండలేని బలహీనత మీకు ఉందా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.

కేకుల్లో క్యాన్సర్‌ కారకాలు

  • బ్లాక్‌ ఫారెస్ట్‌, రెడ్‌ వెల్వెట్‌లు ప్రమాదకరం

  • బెంగళూరులో 235 శాంపిళ్లను పరీక్షించిన ప్రభుత్వం

  • 12 శాంపిళ్లలో హానికర పదార్థాలు ఉన్నట్లు వెల్లడి

బెంగళూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కేకులంటే మీకు ఇష్టమా? బ్లాక్‌ ఫారెస్ట్‌, రెడ్‌ వెల్వెట్‌ వంటి కంటికి ఇంపుగా కనిపించే కేక్స్‌ చూస్తే తినకుండా ఉండలేని బలహీనత మీకు ఉందా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. మీకు క్యాన్సర్‌ వచ్చే చాన్స్‌ ఎక్కువ అవుతున్నట్లే. కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత శాఖ ఈమేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రజలు అత్యధికంగా ఇష్టపడే కేకుల్లో అనారోగ్య కారకాలైన రసాయనాలు ఉన్నట్లు పేర్కొంది. కాటన్‌ క్యాండీ, గోబీ మంచూరియాల్లో వాడే ‘రోడమైన్‌ బీ’ వంటి కృత్రిమ రంగుల్లో ఆరోగ్యానికి హాని చేసే కారకాలు ఉన్నాయంటూ కర్ణాటక ప్ర భుత్వం వాటిపై నిషేధం విధించింది.

తాజాగా బెంగళూరు నగరంలో వివిధ బేకరీల నుంచి 235 కేక్‌ శాంపిళ్లను అధికారులు సేకరించారు. వాటిని ల్యాబ్స్‌ లో పరీక్షించారు. వాటిలో 12 కేకు శాంపిళ్లలో క్యాన్సర్‌ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. రెడ్‌ వెల్వెట్‌, బ్లాక్‌ ఫారెస్ట్‌ కేకుల్లో వాడే కంటికి ఇంపైన రంగులు ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య శాఖ పేర్కొంది. బేకరీలు ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటించాలని, కేకుల్లో అల్లూరా రెడ్‌, సన్‌సెట్‌ యెల్లో ఎఫ్‌సీఎఫ్‌, పోన్సెయూ 4 ఆర్‌, టారా్ట్రజైన్‌, కార్మోయుసన్‌ వంటి రంగులు వాడవద్దని హెచ్చరించింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల విభాగం మార్గదర్శకాలను బేకరీలు పాటించాలని అధికారులు ఆదేశించారు.

Updated Date - Oct 04 , 2024 | 04:11 AM