Share News

Amit Shah: ఖలిస్థానీలపై దాడుల్లో అమిత్‌ షా హస్తం

ABN , Publish Date - Oct 31 , 2024 | 05:28 AM

కెనడాలో ఖలిస్థానీలపై దాడుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హస్తం ఉందని ట్రూడో ప్రభుత్వం తాజాగా ఆరోపించింది.

Amit Shah: ఖలిస్థానీలపై దాడుల్లో అమిత్‌ షా హస్తం

  • కేంద్ర హోంమంత్రిపై కెనడా తాజా ఆరోపణలు

న్యూఢిల్లీ, అక్టోబరు 30: కెనడాలో ఖలిస్థానీలపై దాడుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హస్తం ఉందని ట్రూడో ప్రభుత్వం తాజాగా ఆరోపించింది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కెనడాలో మరిన్ని కార్యకలాపాలు నిర్వహించకుండా నిరోధించాలని భారత్‌ను కోరింది. ఈ కుట్రల వెనుక అమిత్‌ షా పాత్ర ఉందని అమెరికాకు చెందిన ఒక వార్తాపత్రికకు తానే సమాచారం ఇచ్చినట్లు కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్‌ మోరిసన్‌ అంగీకరించారు. మంగళవారం కెనడా స్టాండింగ్‌ కమిటీ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. ‘ఆ జర్నలిస్టు నాకు కాల్‌ చేసి... అది ఆయనేనా (అమిత్‌ షా) అని అడిగారు. ఆయనేనని నేను ధ్రువీకరించాను’ అని పబ్లిక్‌ సేఫ్టీ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ స్టాండింగ్‌ కమిటీకి మోరిసన్‌ వెల్లడించారు.


దీనిపై అట్టావాలోని భారత హైకమిషనర్‌, భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. కాగా, కెనడాలో భారత కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ (ఆర్‌సీఎంపీ) కూడా ఇప్పటి వరకూ అమిత్‌ షాపై బహిరంగంగా ఆరోపణలు చేయలేదు. ఇదిలా ఉండగా, భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో పార్లమెంట్‌ హిల్‌లో ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా కెనడా(ఓఎ్‌ఫఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న దీపావళి వేడుకలకు హాజరు కాబోనని కెనడా ప్రతిపక్ష నేత పియరీ పొయిలీవ్రే ప్రకటించడం విమర్శలకు దారితీసింది.

Updated Date - Oct 31 , 2024 | 05:28 AM