CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు
ABN , Publish Date - Jan 02 , 2024 | 09:04 AM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఈ మేరకు నోటీసులిచ్చారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఈ మేరకు నోటీసులిచ్చారు. జైహింద్ టీవీ ఛానెల్‌లో పెట్టుబడులపై వివరణ ఇవ్వాలని సీబీఐ కోరింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. శివకుమార్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని నమోదైన కేసును 2020లో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేరళకు చెందిన జైహింద్ చానల్‌లో డీకే పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. చానల్‌లో పెట్టిన పెట్టుబడులు, లాభాలు, షేర్ల వివరాలను ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. జైహింద్ చానల్‌లో శివకుమార్‌తోపాటు మరో 30 మంది పెట్టుబడులు పెట్టినట్లు చానల్ ఎండీ బీఎస్ శిజు ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా సీబీఐ నోటీసులపై శివకుమార్ స్పందిస్తూ.. రాజకీయంగా తనను అంతం చేయాలని కుట్ర సాగుతోందన్నారు.
సిఆర్‌పిసి సెక్షన్ 91 కింద జారీ చేసిన నోటీసులో శివకుమార్, అతని భార్య ఉషా శివకుమార్ చేసిన పెట్టుబడుల వివరాలను అందించాలని ఏజెన్సీ ఛానెల్‌ని కోరింది. వారు చెల్లించిన డివిడెండ్‌లు, షేర్ల లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు స్టేట్‌మెంట్‌లు, హోల్డింగ్‌ల వివరాలను కోరింది. దీంతోపాటు ఖాతా పుస్తకాలు, ఒప్పంద వివరాలు సహా అన్ని లావాదేవీలను సమర్పించాలని సీబీఐ కోరింది. శివకుమార్ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఈ ఛానెల్‌లో పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
తమకు సీబీఐ నోటీసు అందిందని ఏజెన్సీ కోరిన అన్ని పత్రాలను అందజేస్తామని జైహింద్ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ షిజు తెలిపారు. రికార్డులన్నీ తమ వద్ద ఉన్నాయని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలోనే రాజకీయ ప్రతీకారానికి చర్యగా ఈ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2013 నుంచి 2018 మధ్య కాలంలో శివకుమార్ రూ.74 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని సీబీఐ తెలిపింది. అంతేకాదు ఇది తన ఆదాయానికి మించిన విధంగా ఉందని శివకుమార్‌పై 2020లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.