పల్లెల పురోగతికి ప్రణాళికలు
ABN , Publish Date - Sep 29 , 2024 | 04:00 AM
పల్లెలను పురోగతి బాట పట్టించే దిశగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై దిశానిర్దేశం చేసేందుకు అక్టోబరు 2న ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనుంది.
2న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు
2.55 లక్షల పంచాయతీల్లో నిర్వహణ
అభివృద్ధి ప్రణాళికలపై మార్గనిర్దేశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: పల్లెలను పురోగతి బాట పట్టించే దిశగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై దిశానిర్దేశం చేసేందుకు అక్టోబరు 2న ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనుంది. ఈ సభల్లో దేశవ్యాప్తంగా 2.55 లక్షల గ్రామ పంచాయతీలు, 6,700 బ్లాక్ పంచాయతీలు, 665 జిల్లా పంచాయతీలు పాల్గొంటాయని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అన్ని పంచాయతీల్లో భాగస్వామ్య ప్రణాళికను పెంపొందించడం, పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు(పీడీపీ) సకాలంలో రూపొందించడం లక్ష్యంగా ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ అభియాన్ కింద శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో 20వేల మంది కళాశాల విద్యార్థులు పాల్గొంటారని, వారంతా వివిధ పంచాయతీల్లో పీడీపీల తయారీకి సహకరిస్తారని అధికారులు వెల్లడించారు. ఈ సభలను పర్యవేక్షించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేసిన పంచాయతీలకు అధికారులు, కన్సల్టెంట్లను నియమిస్తున్నారు. అక్టోబరు 2 కార్యక్రమానికి ముందు, ఈ నెల 30న మంత్రిత్వ శాఖ ఒక జాతీయ వర్క్‌షా్‌పను నిర్వహించనుంది. దీనిలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, పంచాయతీల ప్రతినిధులు పాల్గొని తన అనుభవాలను పంచుకుంటారు.