Chennai: రేపు అమిత్ షాతో రాష్ట్ర ఎంపీల భేటీ
ABN , Publish Date - Jan 12 , 2024 | 07:46 AM
వరుస వర్షాలు, తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని, సహాయక చర్యల కోసం భారీగా నిధులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎంపీలు శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah)తో భేటీ కానున్నారు.
- తుఫాను బాధిత ప్రాంతాలకు భారీ నిధుల కోసం పట్టు
పెరంబూర్(చెన్నై): వరుస వర్షాలు, తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని, సహాయక చర్యల కోసం భారీగా నిధులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎంపీలు శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah)తో భేటీ కానున్నారు. ఈ మేరకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ లభించడంతో ఎంపీలు ఢిల్లీ బయలుదేరివెళ్తున్నారు. మిచౌంగ్ తుఫాను కారణంగా చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు, భారీవర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. తుఫాను బాధిత జిల్లాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారీవర్షాల బాధిత జిల్లాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా కేంద్ర అధికారుల బృందం పర్యటించి, వరద నష్టాన్ని అంచనా వేసింది. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన నిర్మలా సీతారామన్ వద్ద రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి తంగం తెన్నరసు వరద బాధితులను ఆదుకోవడం, బాధిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన మరమ్మతులకు సుమారు రూ.21,000 కోట్లు అందించాలని లేఖ రూపంలో విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రులు, అధికారులు పర్యటించినా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు అందలేదు. దీంతో, రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష ఎంపీలతో బృందం కలిసేందుకు కేంద్రమంత్రి అమిత్‌షా సమయం కేటాయించాలని సీఎం స్టాలిన్ లేఖ రాశారు. అదే సమయంలో రాష్ట్రానికి వరద సహాయ నిధులు అందజేసి కేంద్రం ఆదుకోవాలని కోరుతూ సీపీఎం, సీపీఐలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో, శనివారం రాష్ట్ర ఎంపీలకు అమిత్‌షా సమయం కేటాయించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వరద నివారణ నిధులు రూ.37,907.19 కోట్లు అందించాలని రాష్ట్ర ఎంపీల బృందం కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.