Share News

Chennai: ఆపార్టీకి కేవలం ఒక్క ఎంపీ సీటే.. సీఎం సమక్షంలో కుదిరిన ఒప్పందం

ABN , Publish Date - Mar 09 , 2024 | 10:41 AM

డీఎంకే కూటమిలో రెండు సీట్ల కోసం పట్టుబట్టిన ఎండీఎంకే(MDMK) చివరకు ఒక స్థానానికే సరిపెట్టుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం డీఎంకే(DMK) ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.

Chennai: ఆపార్టీకి కేవలం ఒక్క ఎంపీ సీటే.. సీఎం సమక్షంలో కుదిరిన ఒప్పందం

చెన్నై: డీఎంకే కూటమిలో రెండు సీట్ల కోసం పట్టుబట్టిన ఎండీఎంకే(MDMK) చివరకు ఒక స్థానానికే సరిపెట్టుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం డీఎంకే(DMK) ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ ఎన్నికల్లో ఎండీఎంకే గెలిచేందుకు అవకాశాలున్న కాంచీపురం, కడలూరు, ఈరోడ్‌, విరుదునగర్‌, తిరుచ్చి, మైలాడుదురై నియోజకవర్గాలలో రెండు నియోజకవర్గాలను తమ పార్టీకి కేటాయించాలని ఎండీఎంకే పట్టుబట్టింది. డీఎంకే అధిష్టానం కుదరదని చెప్పటండంతో ఒక లోక్‌సభ సీటు, ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని కోరింది. ఆ దిశగా సీట్ల సర్దుబాట్లపై డీఎంకే కమిటీ, ఎండీఎంకే కమిటీ సభ్యుల నడుమ మూడు విడతలుగా చర్చలు జరిగినా సీట్ల కేటాయింపు ఖరారు కాలేదు. చివరకు స్టాలిన్‌ సమక్షంలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఒక్కసీటు డీఎంకే అధిష్టానం కేటాయించింది. ఈ విషయమై అన్నా అరివాలయం బయట వైగో విలేఖరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు అండగా ఉంటూ కూటమి విజయానికి పాటుపడతామన్నారు. ఎండీఎంకే పోటీ చేయనున్న నియోజకవర్గం గురించి మిత్రపక్షాలతో చర్చించిన మీదట డీఎంకే అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. రాజ్యసభ సీటు కోసం స్టాలిన్‌తో చర్చించలేదని, రాజ్యసభ ఎన్నికలు సమీపించినప్పుడు ఆ విషయమై ప్రస్తావించాలని అనుకుంటున్నామని వైగో తెలిపారు.

nani1.jpg

డీపీఐకి రెండు సీట్లు: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలోని డీపీఐకి రెండు సీట్లు ఖరారైంది. గత కొంతకాలంగా సీట్ల పంపకాలపై రెండు పార్టీల మధ్య కొనసాగిన ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. గతంలాగే డీపీఐ రెండు నియోజకవర్గాలలో పోటీ చేయడానికి అంగీకరించింది. ఆ మేరకు అన్నా అరివాలయంలో సీఎం స్టాలిన్‌, డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ విషయమై డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌ మాట్లాడుతూ కూటమిలోని ఇతర మిత్రపక్షాలతో చర్చలు ముగిసిన తర్వాత నియోజకవర్గాల జాబితాను డీఎంకే అధిష్టానం విడుదల చేస్తుందని తెలిపారు. తమ పార్టీ గుర్తుపైనే పోటీ చేయడానికి డీఎంకే అంగీకరించిందని, దీనితో కుండ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

రేపే కాంగ్రెస్‌ సీట్ల ఖరారు...

ఇదిలా ఉండగా డీఎంకే కూటమిలో ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రె్‌సకు ఆదివారం సీట్ల కేటాయింపు ఖరారవుతుంది. మక్కల్‌నీదిమయ్యంతో గురువారం డీఎంకే సీట్ల సర్దుబాట్ల కమిటీ సభ్యులు చర్చలు జరగటంతో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కోరుతున్న పది సీట్లు కేటాయించడానికి వీలులేదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఈ సారి తమకు పది సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు ఆదివారం ఖరారవుతుందని డీఎంకే నేతలు తెలిపారు.

Updated Date - Mar 09 , 2024 | 10:41 AM