Chief Minister: నేను కమీషన్ తీసుకున్నట్లు నిరూపిస్తారా.. రాజకీయాలకు గుడ్‌బై చెబుతా..
ABN , Publish Date - Mar 05 , 2024 | 01:07 PM
కాంట్రాక్టర్ల నుంచి ఐదు పైసల లంచం తీసుకున్నానని నిరూపించినా రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సవాల్ విసిరారు.
- ముఖ్యమంత్రి సిద్దరామయ్య సవాల్
బెంగళూరు: కాంట్రాక్టర్ల నుంచి ఐదు పైసల లంచం తీసుకున్నానని నిరూపించినా రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా తన వ్యవధిలో ఎవరి నుంచి కూడా లంచం తీసుకోలేదని స్పష్టం చేశారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కాంట్రాక్టర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎల్‌ఓసీ రిలీజ్ చేసేందుకు తాను లంచం తీసుకున్నట్టు కాంట్రాక్టర్ ఎవరైనా బహిరంగ పరిస్తే రాజీనామా చేస్తానని తెలిపారు. సీఎంగా సూచించినా, ఆదేశించినా గ్రాంట్లు లేకుండా పనులు చేయరాదని పేర్కొన్నారు. తద్వారా కాంట్రాక్టర్‌లకే సమస్య తలెత్తుతుందన్నారు. మీకు కోట్లాదిరూపాయల బకాయిలు ఉన్నాయని, వాటిని ఎక్కడి నుంచి తీసుకురావాలన్నారు. ఇదే సందర్భంగా సీఎంకు కాంట్రాక్టర్లు తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు అధికారులు, రాజకీయ నాయకుల నుంచి వేధింపులు ఉన్న విషయం తన దృష్టిలో ఉందన్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ఏదైనా రాజకీయ పార్టీలకు కాంట్రాక్టర్లు దూరంగా ఉండాలని సూచించారు. రానున్న 9 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు. మీ సమస్యలను పరిష్కరిస్తామని, ఇది గుర్తుంచుకోవాలన్నారు. తాము ప్రభుత్వాన్ని నడుపుతామని, మీరు పనులు చేస్తారని చెప్పారు. ఇవి రెండూ దేశ ప్రగతికి అనుబంధమైనవన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉందన్నారు. గత ప్రభుత్వం సమగ్రమైన పథకాలు తీసుకురాకుండా మిమ్మల్ని తప్పుబట్టిందన్నారు. జలవనరులశాఖలో రూ.16వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి రూ.25వేల కోట్లకు అనుమతులు ఇచ్చారన్నారు. కేవలం జలవనరులశాఖలోనే రూ.1.25 లక్షల కోట్ల పనులు సాగుతున్నాయన్నారు. కాంట్రాక్టర్లు ఎలా పని చేయాలని, ప్రభుత్వం బిల్లులు ఎలా సమకూర్చాలని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు అవినీతి మరక అంటిందన్నారు. ప్యాకేజ్ పద్ధతి రద్దు చేయాలని, బాకీ మొత్తం విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు.