Mani Shankar Aiyar: 1962 యుద్ధంలో భారత్‌పై చైనా దాడి ఆరోపణే.. మణి శంకర్ అయ్యర్ మరో వివాదం
ABN , Publish Date - May 29 , 2024 | 03:02 PM
1962లో భారత్‌పై చైనా దాడి గురించి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నాడు భారత్‌పై చైనా బలగాలు దాడి చేశాయనే 'ఆరోపణలు' ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఏదోరూపంలో కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని చిక్కుల్లో నెట్టేస్తుండటం రివాజైంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా ఆ పార్టీ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ 'జాతివివక్ష' వ్యాఖ్యలు చేయడం, 'వారసత్వ పన్ను' అంటూ మాట్లాడటం వివాదం రేపగా, ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) సైతం వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నారు. పాకిస్థా్న్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వివాదం ఇంకా సద్దుమణగక ముందే తాజాగా మరో వివాదానికి ఆయన తెరలేపారు. 1962లో భారత్‌పై చైనా దాడి గురించి ప్రస్తావిస్తూ, నాడు భారత్‌పై చైనా బలగాలు దాడి చేశాయనే 'ఆరోపణలు' ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.
కల్లోల్ భట్టాచార్జీ రాసిన ''నెహ్రూస్ ఫస్ట్ రిక్రూట్స్: ద డిప్లమేట్స్ హూ బిల్డ్ ఇండిపెండెంట్ ఇండియాస్ ఫారెన్ పాలసీ'' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ, 1962 అక్టోబర్‌లో భారత్‌పై చైనా బలగాలు దాడి చేశాయనే ఆరోపణలున్నాయని వ్యాఖ్యానించారు. వాస్తవానికి 1962 అక్టోబర్-నవంబర్ మధ్య ఇండో-చైనా యుద్ధం జరిగింది. చైనా బలగాలు 'మెక్‌మోకన్ లైన్' వెంబడి దాడి చేసి ఇండియాకు చెందిన 'ఆక్సాయ్ చిన్' ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.
బీజేపీ అభ్యంతరం..కాంగ్రెస్ వివరణ
చైనా దాడిని ఆరోపణగా మణిశంకర్ అయ్యర్ పేర్కొనడంపై భారతీయ జనతాపార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే చైనా దురాక్రమణను కాంగ్రెస్ తుడిచివేయాలని అనుకుంటోందని విమర్శించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు వచ్చే శాశ్వత సభ్యత్వాన్ని కూడా నెహ్రూ ఆనాడు చైనా కోసం వదిలేశారని పార్టీ తప్పుపట్టింది. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ వెంటనే వివరణ ఇచ్చింది. మణిశంకర్ అయ్యర్ పొరపాటున 'ఆరోపణ' అనే పదాన్ని వాడారని, దానికి వెంటనే క్షమాపణలు తెలియజేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ఈ వివాదానికి కాంగ్రెస్ దూరంగా ఉంటుందన్నారు. చైనా బొరబాట్లను భారత ప్రధాన నరేంద్ర మోదీనే ఆరోపణగా అభివర్ణించి ఆ దేశానికి క్లీన్ చిట్ ఇచ్చారంటూ ఆయన ప్రతి విమర్శలు చేశారు.