CM Eknath Shinde : ముంబైలో కార్లకు టోల్ ఫ్రీ!
ABN , Publish Date - Oct 15 , 2024 | 03:47 AM
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముంబై నగరంలోకి ప్రవేశించే ఐదు టోల్ బూత్‌ల్లో కార్ల (లైట్ మోటార్ వాహనాల)కు టోల్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
నగరంలోకి ప్రవేశించే ఐదు బూత్‌లలో అమల్లోకి
ముంబై, అక్టోబరు 14: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముంబై నగరంలోకి ప్రవేశించే ఐదు టోల్ బూత్‌ల్లో కార్ల (లైట్ మోటార్ వాహనాల)కు టోల్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. సీఎం ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టోల్ బూత్‌ల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని, టోల్ ఫీజును రద్దు చేయాలని వాహనదారులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారని సీఎం శిందే క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
అందుకే టోల్ ఫీజు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం దహిసర్, ఎల్‌బీఎస్ రోడ్-ములుంద్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే-ములుంద్, ఎయిరోలి క్రీక్ బ్రిడ్జి, వాశి టోల్ బూత్‌ల్లో ఇకపై కార్లు, జీపులు, వ్యాన్లు, ఆటోలు, ట్యాక్సీలు, డెలివరీ వ్యాన్లు, చిన్నపాటి ట్రక్కులు టోల్ రుసుము చెల్లించకుండానే ప్రయాణించవచ్చు. రోజూ ఈ టోల్ బూత్‌ల గుండా 6 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 80 శాతం లైట్ మోటార్ వాహనాలేనని అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్ వెలువడడానికి కొద్ది గంటల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.